- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సినిమాలో అవకాశం పేరుతో మోసం.. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో క్యాస్టింగ్ ఆర్టిస్ట్‌పై కేసు నమోదు
సినిమా అవకాశం, బాకీ డబ్బుల పేరుతో యువనటిపై లైంగిక దాడికి యత్నించిన క్యాస్టింగ్ ఆర్టిస్ట్. బాధితురాలి ఫిర్యాదుతో బంజారాహిల్స్‌లో కేసు నమోదు!

దిశ, వెబ్ డెస్క్: సినిమాలో అవకాశం ఇప్పిస్తానని నమ్మించి ఓ యువతిని క్యాస్టింగ్ ఆర్టిస్ట్ (Casting Artist) మోసం చేశాడని ఫిర్యాదు అందడంతో కేసు నమోదు అయింది. దీంతో తెలుగు సినీ పరిశ్రమలో మరోసారి క్యాస్టింగ్ కౌచ్ (Casting couch) కలకలం రేగింది. వివరాల్లోకి వెళితే.. సినిమాలో అవకాశం ఇప్పిస్తానని నమ్మించి ఒక యువనటిని (21) లైంగికంగా వేధించడంతో పాటు పారితోషికం ఇవ్వకుండా ప్రసాద్ అనే క్యాస్టింగ్ ఆర్టిస్ట్ మోసం చేసినట్లు ఫిర్యాదు అందింది. దీంతో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ (Banjara Hills Police Station)లో కేసు నమోదైంది. కొన్నేళ్లుగా చిత్ర పరిశ్రమలో ఉంటున్న సదరు యువనటికి, ఒక సినిమాలో హీరోయిన్ స్నేహితురాలి పాత్ర ఇప్పిస్తానని నిందితుడు ప్రసాద్ సంప్రదించాడు. ఆ నమ్మకంతో ఆమె సదరు సినిమాలో నటించింది. 2025 అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు ఆ సినిమా షూటింగ్ కూడా పూర్తయింది. అయితే, షూటింగ్ ముగిసిన తర్వాత నటికి ఇవ్వాల్సిన రూ. 90 వేల రెమ్యునరేషన్‌తో పాటు రూ. 38 వేల ట్రావెల్ అలవెన్స్ (ప్రయాణ చార్జీలు) ఇవ్వకుండా ప్రసాద్ తప్పించుకొని వచ్చాడు.
ఈ క్రమంలోనే బాకీ డబ్బుల విషయం మాట్లాడటానికి ఈ ఏడాది ఫిబ్రవరి 18వ తేదీన తనను కలవాలని సదరు యువనటికి ప్రసాద్ చెప్పాడు. ఆమె అక్కడికి వెళ్లగా నిందితుడు ఆమెను బలవంతంగా కారులో ఎక్కించుకుని, తన కోరిక తీరిస్తే భవిష్యత్తులో మరిన్ని సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానంటూ లైంగిక దాడికి ప్రయత్నించాడని, అతని నుండి తప్పించుకున్న బాధితురాలు.. జరిగిన ఘోరాన్ని తన తల్లికి వివరించింది. దీంతో బాధితురాలి తల్లి నిందితుడు ప్రసాద్‌ను నిలదీయగా, అతడు ఆమెపై కూడా తీవ్ర పదజాలంతో దూషణలకు దిగాడు. ఈ వేధింపులు భరించలేక చివరకు బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. యువనటి ఇచ్చిన లిఖితపూర్వక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు.. నిందితుడు ప్రసాద్‌పై దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తుంది.






