జమ్మికుంటలో నిబంధనలకు విరుద్ధంగా వైన్ ​షాపుల నిర్వహణ

by Malleboina Mahesh |   (  Updated:2026-03-08 02:55:58  IST  )

జమ్మికుంటలో నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయాలు. విద్యాసంస్థలు, రద్దీ ప్రాంతాల్లో వైన్ షాపులు. అధికారుల నిర్లక్ష్యంపై స్థానికుల ఆగ్రహం.

జమ్మికుంటలో నిబంధనలకు విరుద్ధంగా వైన్ ​షాపుల నిర్వహణ
X

దిశ,​ జమ్మికుంట: జమ్మికుంట పట్టణంలో మద్యం విక్రయాలు నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్నాయి. ఎక్సైజ్ నిబంధనలను తుంగలో తొక్కి జన సామర్థ్యం ఉన్న ప్రాంతాల్లో, విద్యాసంస్థల చెంతనే మద్యం దుకాణాలు వెలుస్తుండటంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల అండదండలు, రాజకీయ నాయకుల పలుకుబడితోనే యజమానులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

​విద్యార్థులకు శాపంగా మారిన వైన్ షాపులు..

​పట్టణంలోని గాంధీ చౌరస్తా, అంబేద్కర్ చౌరస్తా వంటి రద్దీ ప్రాంతాలతో పాటు, రైల్వే స్టేషన్ మరియు పోలీస్ స్టేషన్ పరిసరాల్లో మద్యం దుకాణాలు యథేచ్ఛగా నడుస్తున్నాయి. మరీ ముఖ్యంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పాఠశాలలకు కూతవేటు దూరంలోనే వైన్ షాపులు ఉండటం గమనార్హం. గతంలో విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు వీటిని తరలించాలని పెద్ద ఎత్తున ధర్నాలు చేసినా, సంబంధిత అధికారులు మాత్రం కనీసం పట్టించుకోకపోవడం వెనుక ఉన్న మతలబు ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

​ఫంక్షన్ హాల్.. కాస్తా సిట్టింగ్ రూమ్‌గా..

​నిబంధనల ప్రకారం వైన్ షాపులకు నిర్ణీత స్థలం ఉండాలి. కానీ, జమ్మికుంటలో ఒక అడుగు ముందుకు వేసి ఏకంగా ఒక ఫంక్షన్ హాల్‌నే వైన్ షాప్ సిట్టింగ్ ఏరియాగా మార్చేశారు. వివాహాలు, శుభకార్యాలు జరగాల్సిన చోట ఇప్పుడు మందుబాబుల కేకలు, గొడవలతో అపవిత్రం చేస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

​పక్కపక్కనే షాపులు.. నిత్యం 'జన జాతర'

​పట్టణంలో కొన్ని చోట్ల ఒక వైన్ షాపు పక్కనే మరో షాప్ ఉండటంతో ఆ ప్రాంతమంతా మందుబాబులతో కిక్కిరిసిపోతోంది. దీనివల్ల సాధారణ పాదచారులు, ముఖ్యంగా మహిళలు ఆ దారిలో వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. కనీస నిబంధనలు పాటించకుండా దుకాణాలు పక్కపక్కనే ఎలా అనుమతించారని ప్రజలు నిలదీస్తున్నారు.

​మామూళ్ల మత్తులో యంత్రాంగం?

‘ప్రభుత్వానికి ఆదాయం వస్తే చాలు.. ప్రజల యోగక్షేమాలు పట్టవా?’ అని స్థానికులు అధికారులను నిలదీస్తున్నారు. వైన్ షాపు యజమానుల నుంచి అందుతున్న భారీ మామూళ్ల వల్లే అధికారులు ఈ అక్రమాలను చూసీచూడనట్లు వదిలేస్తున్నారని బహిరంగంగానే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వైన్ షాపుల పై చర్యలు తీసుకోవాలని జమ్మికుంట ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Next Story