చస్తేనే స్పందిస్తారా..?

by Ratna Kumari |

ఎవరైనా చస్తే గాని అధికారులు స్పందించేటట్లు లేరని స్థానికులు, వాహనదారులు ఆర్ అండ్ బి అధికారులపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

చస్తేనే స్పందిస్తారా..?
X

దిశ, గండిపేట : ఎవరైనా చస్తే గాని అధికారులు స్పందించేటట్లు లేరని స్థానికులు, వాహనదారులు ఆర్ అండ్ బి అధికారులపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని హైదర్ షాకోట్ రఘురామ్ నగర్ సమీపంలో ఉన్న బీజాపూర్ జాతీయ రహదారి అత్యంత ప్రమాదకరంగా మారింది. బండ్లగూడ వైపు నుంచి సన్ సిటీ వైపు వచ్చే మార్గంలో రోడ్డు కుంగిపోవడంతో ఎప్పుడు ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రహదారి రోజురోజుకూ మరింత కుంగిపోతున్నప్పటికీ, ఎప్పటికప్పుడు పర్యవేక్షించి మరమ్మతులు చేపట్టాల్సిన ఆర్ అండ్ బి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు, వాహనదారులు మండిపడుతున్నారు. ప్రతిరోజూ వేలాది వాహనాలు ఈ రహదారిపై రాకపోకలు సాగిస్తుండటంతో ప్రమాద ముప్పు మరింత పెరిగింది.

నిర్లక్ష్యపు మత్తు వీడండి..

ప్రమాదకరంగా మారిన ఈ ప్రాంతంలో ఆర్ అండ్ బి అధికారులతో పాటు స్థానిక మున్సిపల్ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు. కుంగిపోయిన ప్రాంతంలో బారికేడ్లు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. సరైన వీధి దీపాలు లేకపోవడం, రహదారి పక్కనే లోతైన కాలువ ఉండటంతో రాత్రి వేళ ప్రమాదాల అవకాశాలు మరింత పెరిగాయి. ప్రమాదం జరిగి ప్రాణనష్టం సంభవించేలోపే సంబంధిత శాఖలు నిర్లక్ష్యపు మత్తు వీడి తక్షణమే మరమ్మతులు చేపట్టి భద్రతా చర్యలు అమలు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Next Story