ఓటరు లిస్టులో పేరు లేకుంటే ఆ రేషన్ కార్డు రద్దు?

by Muthe.Rajitha |

ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియపై ప్రజల్లో కొత్త ఆందోళనలు మొదలయ్యాయి.

ఓటరు లిస్టులో పేరు లేకుంటే ఆ రేషన్ కార్డు రద్దు?
X

దిశ, వెబ్ డెస్క్ : ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియపై ప్రజల్లో కొత్త ఆందోళనలు మొదలయ్యాయి. ఓటర్ల జాబితా సవరణ జరిగిన తర్వాత ఎన్నికల సంఘం విడుదల చేసే తుది లిస్టులో గనుక పేరు లేకపోతే, ప్రభుత్వ పథకాలు రద్దు అవుతాయనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ ఆందోళనలకు ఊతమిస్తూ, ఇప్పటికే పశ్చిమ బెంగాల్‌లో ఏర్పడిన కొత్త ప్రభుత్వం ఓటర్ల జాబితాలో లేని వారికి రేషన్ కార్డులు రద్దు చేసే ప్రక్రియను కూడా మొదలుపెట్టింది. అక్కడ ఓటర్ల లిస్టులో పేర్లు లేని వారిని అనర్హులుగా ప్రకటిస్తూ, వారిని రేషన్ కార్డుల నుంచి అధికారికంగా తొలగిస్తోంది.

కాగా మరికొద్ది రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ SIR ప్రక్రియ ప్రారంభం కానుంది. పశ్చిమ బెంగాల్‌లో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో, ఏపీ, తెలంగాణలలో కూడా ఈ ప్రక్రియ మొదలైతే రేషన్ కార్డులతో సహా పలు కేంద్ర ప్రభుత్వ పథకాలు ఎక్కడ రద్దు అవుతాయోననే భయాలు, ఆందోళనలు ప్రస్తుతం ఇరు రాష్ట్రాల ప్రజల్లో తీవ్రంగా నెలకొన్నాయి. అయితే అధికారులు మాత్రం ప్రజలు ఇలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. ఒకవేళ సాంకేతిక కారణాల వల్ల ఓటర్ల జాబితాలో పేరు తొలగించబడినా, వెంటనే ఓటర్ హెల్ప్‌లైన్ యాప్ ద్వారా గాని స్థానిక పోలింగ్ కేంద్రం వద్ద గాని ఫామ్-6 సమర్పించి పేరును తిరిగి నమోదు చేసుకోవచ్చని సూచిస్తున్నారు.

Next Story