- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలుగు వర్సిటీ పై భారీ వివాదం.. నాంపల్లి క్యాంపస్‌ను ఖాళీ చేయిస్తారా ?
తెలంగాణలో తెలుగు భాష, సాహిత్యం, చరిత్ర, కళలు, సంస్కృతికి కేంద్రబిందువుగా ఉన్న సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నాంపల్లి ప్రాంగణాన్ని ప్రైవేటు సంస్థలకు ధారాదత్తం చేసే ప్రయత్నాలను విరమించాలని వర్సిటీ విద్యార్థులు ప్రభుత్వాన్నికి విజ్ఞప్తి చేస్తున్నారు.

దిశ, రవీంద్ర భారతి : తెలంగాణలో తెలుగు భాష, సాహిత్యం, చరిత్ర, కళలు, సంస్కృతికి కేంద్రబిందువుగా ఉన్న సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నాంపల్లి ప్రాంగణాన్ని ప్రైవేటు సంస్థలకు ధారాదత్తం చేసే ప్రయత్నాలను విరమించాలని వర్సిటీ విద్యార్థులు ప్రభుత్వాన్నికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఆదివారం సెలవు దినమైనప్పటికీ నాంపల్లి ప్రాంగణంలో జ్యోతిష విద్యార్థులు మా చదువుల తల్లిని దూరం చేయవద్దు అనే ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. నాంపల్లి విశ్వవిద్యాలయ ప్రాంగణాన్ని పరిరక్షించాలని, ప్రైవేటు సంస్థలకు అప్పగించే నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని నినాదాలు చేశారు. అవసరమైతే తమ ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రస్తుతం నాంపల్లి ప్రాంగణంలో అందుబాటులో ఉన్న తరగతి గదులే విశ్వవిద్యాలయ అవసరాలకు సరిపోవడం లేదని వారు పేర్కొన్నారు.
ఇప్పటికే ప్రభుత్వ నిర్ణయాల మేరకు ప్రాంగణంలోని కొంత భాగాన్ని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ), చేనేత-జౌళి పరిశ్రమ శాఖలకు కేటాయించడంతో స్థలాభావం మరింత తీవ్రమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో మొత్తం ప్రాంగణాన్ని ఖాళీ చేయించి ఇతరులకు అప్పగిస్తే విశ్వవిద్యాలయం తన ఉనికిని, ప్రాధాన్యతను కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాంపల్లి ప్రాంగణంలో దూరవిద్య, నిరంతర విద్యా కార్యక్రమాలతో పాటు తెలుగు సంస్కృతి పరిరక్షణ, విస్తరణ సేవలు, సాహిత్య-సాంస్కృతిక కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తున్నారని తెలిపారు.
నగర నడిబొడ్డున ఉన్న ఈ ప్రాంగణాన్ని తరలిస్తే విద్యార్థులు, కళాకారులు, సాహితీవేత్తలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉండగా, దాదాపు ఒకటిన్నర దశాబ్దం క్రితం పదవీ విరమణ పొందిన ఓ మాజీ ఆచార్యుడు తాను సేకరించిన ప్రాచీన వస్తువులను సుమారు 4,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అనధికారికంగా విశ్వవిద్యాలయంలో ఉంచడమే కాకుండా తెలుగు వర్సిటీలో ఆరుబయట ఎటువంటి అనుమతులు లేకుండా ఉంచిన కర్ర సామగ్రి పాడైపోతుందని తప్పుడు ప్రకటనలను చేయడం హాస్యాస్పదమని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఇకనైనా ఆద్యకళ సమితి సభ్యులు తమ అభిప్రాయాన్ని మార్చుకుని రాష్ట్రప్రభుత్వ గిరిజన మ్యూజియంలో తమ ఆద్యకళా ప్రదర్శనను ఏర్పాటు చేసుకోవాలని, తెలుగు విశ్వవిద్యాలయంలో అనధికారంగా ఉంచిన తమ వస్తువులను తరగతి గదుల నుంచి ఖాళీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.






