Tata Motors: 30 శాతం ఈవీ మార్కెట్ వాటాపై టాటా మోటార్స్ కన్ను

by S Gopi |

ఇందుకోసం ప్రస్తుతం ఉన్న నెక్సాన్.ఈవీ, పంచ్.ఈవీ, కర్వ్.ఈవీ, హారియర్.ఈవీ, టియాగో.ఈవీ, ఎక్స్‌ప్రెస్-టీ మోడళ్లతో పాటు నాలుగు కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్లోకి తీసుకురానుంది.

Tata Motors: 30 శాతం ఈవీ మార్కెట్ వాటాపై టాటా మోటార్స్ కన్ను
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) మార్కెట్ ఇప్పుడు మొదటి దశ కస్టమర్లను దాటి, వేగంగా వృద్ధి చెందుతోందని భావిస్తున్నట్టు టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ వెల్లడించింది. దీన్ని అందుకునేందుకు కంపెనీ భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. కంపెనీ ఇన్వెస్టర్ ప్రజెంటేషన్ ప్రకారం, 2030-31 నాటికి ఈవీ మార్కెట్‌లో 30 శాతం కంటే ఎక్కువ వాటా సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం ప్రస్తుతం ఉన్న నెక్సాన్.ఈవీ, పంచ్.ఈవీ, కర్వ్.ఈవీ, హారియర్.ఈవీ, టియాగో.ఈవీ, ఎక్స్‌ప్రెస్-టీ మోడళ్లతో పాటు నాలుగు కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్లోకి తీసుకురానుంది. అలాగే ఇప్పటికే ఉన్న మోడళ్లకు 10కిపైగా ఫేస్‌లిఫ్ట్‌లు, అప్‌డేట్లు ఇవ్వాలని కంపెనీ భావిస్తోంది. రాబోయే మోడళ్లలో సియెర్రా.ఈవీతో పాటు అవిన్యా కాన్సెప్ట్ ఆధారిత మోడల్ కూడా ఉండనుంది. ఈవీలను కొనుగోలు చేసే కస్టమర్ల తీరు మారుతోందని టాటా అభిప్రాయపడింది. ఇప్పటి వరకు కొత్త టెక్నాలజీని ముందుగా స్వీకరించే వినియోగదారులే ఈవీలను కొనుగోలు చేయగా, ఇప్పుడు మెయిన్‌స్ట్రీమ్ కస్టమర్లు కూడా ఈ విభాగంపై ఆసక్తి చూపుతున్నారని తెలిపింది. ఈ మార్పుకు అనుగుణంగా, రాబోయే తరం ఈవీల్లో ప్రస్తుత మోడళ్ల కంటే 2–3 రెట్లు ఎక్కువ డ్రైవింగ్ రేంజ్, మూడు రెట్లు వేగవంతమైన ఛార్జింగ్, 20–23 శాతం అధిక ఎనర్జీ డెన్సిటీ కలిగిన బ్యాటరీ టెక్నాలజీపై కంపెనీ పనిచేస్తున్నట్టు పేర్కొంది.

Next Story