నత్త నడకన రామాలయం అభివృద్ధి పనులు.. పుష్కరాలకు పూర్తయ్యేనా..?

by Jakkula.Mamatha |

రామాలయం అభివృద్ధి పనులపై రామ భక్తులు సందేహం వ్యక్తం చేస్తున్నారు.

నత్త నడకన రామాలయం అభివృద్ధి పనులు.. పుష్కరాలకు పూర్తయ్యేనా..?
X

రామాలయం అభివృద్ధి పనులు పుష్కరాల నాటికి పూర్తి చేస్తారా? కూల్చి కుప్పగా పెడతారా? అనే సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవేళ పూర్తి చేసినా.. ఈ హడావుడి పనుల్లో నాణ్యత ఉంటుందా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. మార్చి27 న సీఎం రేవంత్‌రెడ్డి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తే.. జూన్ 27న పనులు ప్రారంభించారు. నిధులు విడుదల అయినా.. పనులు ప్రారంభించడానికి మూడు నెలల సమయం పట్టింది. వర్షాకాలం ప్రారంభమైంది. మరో 20 రోజుల్లో గోదావరి వరదలు వస్తాయి. ఈ సమయంలో పనులు ముందుకు సాగడం కష్టమనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. కేవలం ఒకే ఒక్క జేసీబీతో గుట్టను తొలగించే పనులు చూస్తే నత్తేనయం అనిపిస్తుంది. పుష్కరాల నాటికి మొదటి దశ పనులు పూర్తి కాకపొతే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉండనుంది.

దిశ, భద్రాచలం: రామాలయం అభివృద్ధి పనులపై రామ భక్తులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. మార్చి27 న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తే.... జూన్ 27న పనులు ప్రారంభించారు. నిధులు విడుదల అయినా.. పనులు ప్రారంభించడానికి 3నెలల సమయం పట్టింది. వర్షాకాలం ప్రారంభమైంది. మరో 20 రోజుల్లో గోదావరి వరదలు వస్తాయి. ఈ సమయంలో పనులు ముందుకు సాగడం కష్టమనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. మరో వైపు డిసెంబర్ 10 నుంచి 30వ తేదీ వరకు భద్రాద్రిలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు జరగనున్నాయి. 19వ తేదీ తెప్పోత్సవం, 20వ తేది వైకుంఠ ఏకాదశి నాడు స్వామి వారిని ఉత్తర ద్వారంలో దర్శించుకోవడానికి ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు భద్రాద్రి తరలివస్తారు. 2027 ఏప్రిల్ 15 న శ్రీరామ నవమి సందర్భంగా భద్రాద్రిలో నిర్వహించే సీతారాముల కల్యాణం వీక్షించడానికి లక్షలాది మంది భక్తులు భద్రాద్రికి వస్తారు.

జూన్ 26 నుంచి గోదావరి పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. జూలై 7 వరకు నిర్వహించే పుష్కరాల సమయంలో రోజుకు లక్ష మందికి పైగా భక్తులు భద్రాద్రి క్షేత్రంలో పుణ్య స్నానాలు ఆచరించడానికి వచ్చే అవకాశం ఉంది. ఈ పరిస్థితిలో చేపట్టిన రామాలయం అభివృద్ధి పనులు పుష్కరాల నాటికి పూర్తి చేస్తారా..? కూల్చి కుప్పగా పెడతారా..? అనే సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవేళ పూర్తి చేసినా... ఈ హడావుడి పనుల్లో నాణ్యత ఉంటుందా..? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం రామాలయం దక్షణం వైపున ఉన్న గుట్టను తవ్వుతున్నారు. ఈ స్థలంలో ఆలయానికి సంబంధించిన కార్యాలయాలు నిర్మించనున్నారు. అలాగే ఆలయం చుట్టూ ఉన్న రేకుల షెడ్డును తొలగిస్తున్నారు. అనంతరం ఆలయంలోని వంటసాల, చిత్రకూట మండపం తొలిగించే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రధాన ఆలయం చుట్టూ ఉన్న ఉపాలయాలలోని ఆల్వార్‌లతో పాటు పలు దేవతామూర్తులను రంగనాయకస్వామి వారి గుట్టపై ఉన్న భక్త రామదాసు ధ్యాన మందిరంలో ఏర్పాటు చేసిన బాలాలయానికి తరలించారు. గోదాదేవి, లక్ష్మీ తాయారు అమ్మవార్లను ప్రధాన ఆలయంలో ఉంచారు.

నత్తనడకన పనులు..

భద్రాద్రి రామాలయం అభివృద్ధి, విస్తరణ కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.586కోట్లు కేటాయించింది. మొదటి దశ అభివృద్ధి పనులు రూ.200 కోట్లతో చేపడుతున్నారు. ఈ పనులు వైఆర్‌కే సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తుండగా, శనివారం భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, సర్పంచ్ పూనేం కృష్ణ ప్రత్యేక పూజలు నిర్వహించి పనులు ప్రారంభించారు. ఆ రోజు నుంచి ఒకే ఒక్క జేసీబీతో పనులు చేస్తున్నారు. ఈ పనులు చూస్తే నత్తేనయం అనిపిస్తుంది. సుమారు 20 మీటర్ల ఎత్తు ఉన్న గుట్టను తొలగించాలంటే కనీసం 5 జేసీబీలు పని చేయాల్సి ఉంటుంది. గుట్ట నుంచి తొలగించిన మట్టిని తరలించాలి. తర్వాత భారీ వాల్ నిర్మించిన తర్వాత కార్యాలయాల నిర్మాణం చేపట్టాల్సి ఉంటుంది. కానీ ఊహించిన స్థాయిలో పనులు జరగడం లేదు. దీనిపై జిల్లాలోని ముగ్గురు మంత్రులు దృష్టిసారించకపోతే పనులు ముందుకు సాగే పరిస్థితి కనపడటం లేదు. పుష్కరాల నాటికి మొదటి దశ పనులు పూర్తి కాకపోతే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉండనుంది.

Next Story