సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో కలకలం.. తల్లి పక్కన నిద్రిస్తున్న మూడేళ్ల బాలుడి కిడ్నాప్!

by Jakkula.Mamatha |

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో మూడేళ్ల బాలుడిని గుర్తుతెలియని వ్యక్తి అపహరించాడు.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో కలకలం.. తల్లి పక్కన నిద్రిస్తున్న మూడేళ్ల బాలుడి కిడ్నాప్!
X

దిశ, సికింద్రాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో మూడేళ్ల బాలుడిని గుర్తుతెలియని వ్యక్తి అపహరించాడు. తల్లి పక్కనే నిద్రిస్తున్న చిన్నారిని అత్యంత చాకచక్యంగా ఎత్తుకెళ్లడంతో రైల్వే స్టేషన్‌లో ఆందోళన నెలకొంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధిత మహిళ తన మూడేళ్ల కుమారుడితో కలిసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో నిద్రిస్తోంది. బాలుడు ఎటు వెళ్లకుండా ఉండేందుకు తన చీర కొంగును చిన్నారికి కట్టి పడుకుంది. అర్ధరాత్రి సమయంలో అక్కడికి వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి చీర ముడిని విప్పి, గాఢనిద్రలో ఉన్న బాలుడిని ఎత్తుకెళ్లినట్లు తెలిసింది.

తెల్లవారుజామున నిద్ర లేచిన తల్లి తన కుమారుడు కనిపించకపోవడంతో ఆందోళనకు గురై స్టేషన్ పరిసరాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. అనంతరం ఆమె జీఆర్‌పీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు అందుకున్న రైల్వే పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. స్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా, గుర్తుతెలియని వ్యక్తి బాలుడిని ఎత్తుకెళ్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి. ఈ ఫుటేజీ ఆధారంగా ప్రత్యేక బృందాలతో నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు జీఆర్‌పీ పోలీసులు తెలిపారు.

Next Story