బెంగళూరు ‘డేకేర్’ హారర్.. క్యాప్‌జెమిని సంచలన ప్రకటన

by Kema Shiva Kumar |

బెంగళూరులోని క్యాప్‌జెమిని ఐటీ క్యాంపస్ డేకేర్ సెంటర్‌లో పసిపిల్లలపై జరిగిన అమానవీయ దాడి దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది.

బెంగళూరు ‘డేకేర్’ హారర్.. క్యాప్‌జెమిని సంచలన ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: ఐటీ హబ్, సిలికాన్ సిటీ బెంగళూరులో అత్యంత దిగ్భ్రాంతికరమైన, అమానవీయమైన సంఘటన వెలుగుచూసింది. ప్రముఖ ఐటీ దిగ్గజం క్యాప్‌జెమిని (Capgemini) కి చెందిన బ్రూక్‌ఫీల్డ్, హెచ్ఏఎల్ క్యాంపస్ ప్రాంగణంలోని లిటిల్ బడ్స్ డే కేర్ (Little Buds Day Care) సెంటర్‌లో పసిపిల్లలపై అక్కడి కేర్‌ టేకర్లు దారుణంగా వ్యవహరించిన విషయంలో దేశంలో చర్చనీయాంశంగా మారింది. దీంతో క్యాప్‌జెమిని యాజమాన్యం ఆ డేకేర్ సెంటర్‌ను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లుగా ప్రకటించింది.

ఏడిస్తే చాలు.. వాషింగ్ మెషిన్లలో పెట్టి భయపెట్టడం

అయితే, డేకేర్ సెంటర్‌లో ఐటీ ఉద్యోగులు తమ 2 నుంచి 3 ఏళ్ల వయసున్న పసిపిల్లలను వదిలిపెట్టి విధులకు వెళ్తుంటారు. అయితే, అక్కడ పనిచేసే కొందరు మహిళా సిబ్బంది పిల్లల పట్ల రాక్షసంగా ప్రవర్తించారు. పిల్లలు ఏడ్చినా, అల్లరి చేసినా వారిని గట్టిగా కొట్టడం, ఈడ్చుకెళ్లడం చేసేవారు. వారిని భయపెట్టడం కోసం పసిపిల్లలను ఏకంగా ఫ్రంట్ లోడింగ్ వాషింగ్ మెషీన్ డ్రమ్ లోపల కూర్చోబెట్టి బంధించేవారు. పిల్లలను ఇరుకైన బాత్‌రూమ్‌లలో, నీటితో నిండిన పైపుల వద్ద ఒంటరిగా వదిలేసి తాళాలు వేసేవారు. పిల్లలు ఏడుపు ఆపకపోతే, వాళ్ల నోట్లోకి టాయిలెట్ జెట్ స్ప్రేల (Jet Sprays) ద్వారా ఫోర్స్‌గా నీటిని స్ప్రే చేసేవారని పోలీసుల విచారణలో తేలింది.

వాట్సాప్ వీడియోలతో దారుణం వెలుగులోకి..

ఈ అత్యంత అమానవీయ చర్యలకు సంబంధించిన కొన్ని భయంకరమైన వీడియోలు వాట్సాప్ ద్వారా జిల్లా బాలల సంరక్షణ విభాగానికి (District Child Protection Unit) చేరడంతో ఈ ఉదంతం బయటపడింది. దీనిపై లీగల్ కమ్ ప్రొబేషన్ ఆఫీసర్ తిలకేష్ కుమార్ బెంగళూరులోని హెచ్ఏఎల్ (HAL) పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఐదుగురు మహిళా కేర్ టేకర్లైన మంజుల, విజయలక్ష్మి, భవాని, సింధు, బిందు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఇక ఈ ఘటనపై ‘క్యాప్‌జెమిని’ సంస్థ తీవ్రంగా స్పందించింది. తమ ఉద్యోగులు, వారి కుటుంబాల ఆరోగ్యం, భద్రతకే ఫస్ట్ ప్రియారిటీ అని ప్రకటించింది. ముందస్తు జాగ్రత్త చర్యగా బెంగళూరు క్యాంపస్‌లోని డేకేర్ ఫెసిలిటీని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లుగా ప్రకటించింది.. తమ పిల్లలకు జరిగిన అన్యాయాన్ని వీడియోల రూపంలలో చూసి సాఫ్ట్‌వేర్ దంపతులు తీవ్ర దిగ్భ్రాంతికి, ఆవేదనకు గురవుతున్నారు.

Next Story