- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీఆర్ఎస్ అప్పు అక్షరాలా రూ.8.21 లక్షల కోట్లు: సమాధానం చెప్పాలని కేసీఆర్‌కు భట్టి సవాల్
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మాజీ మంత్రి హరీశ్ రావు పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మాజీ మంత్రి హరీశ్ రావు పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శుక్రవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వ అనాలోచిత విధానాలు, అప్పుల కుప్పలపై శ్వేతపత్రం తరహాలో సంచలన నిజాలను వెల్లడించారు. తాము చేసిన అప్పులను, అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకే కేటీఆర్, హరీశ్ రావు ఇద్దరూ ప్రజా ప్రభుత్వంపై ఎదురుదాడికి దిగుతున్నారని మండిపడ్డారు.
అబద్ధాల పునాదులపై పదేళ్ల పరిపాలన..
"హరీశ్ రావు గతంలో ఆర్థిక మంత్రిగా పనిచేశాననే విషయం మరిచిపోయి మాట్లాడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా విస్తృతంగా అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాటు అబద్ధాల పునాదులపైనే పరిపాలన సాగించింది" అని భట్టి విక్రమార్క విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో చేసిన మొత్తం అప్పు అక్షరాలా రూ.8.21 లక్షల కోట్లు అనీ, ఇందులోనే గత ప్రభుత్వం చెల్లించకుండా వదిలి వెళ్లిన వేల కోట్ల బకాయిలు కూడా ఉన్నాయని స్పష్టం చేశారు. ఈ భారీ అప్పులపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానం చెప్పాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సేవాల్ విసిరారు.
వడ్డీల భారమే రూ.2 లక్షల కోట్లు..
గత ప్రభుత్వం చేసిన అప్పుల కారణంగా ప్రస్తుత ప్రభుత్వంపై పడుతున్న భారాన్ని భట్టి వివరించారు. బీఆర్ఎస్ తెచ్చిన అప్పులకు గానూ.. గడిచిన రెండున్నరేళ్లలోనే తాము అసలు, వడ్డీలు కలిపి రూ.2,08,061 కోట్లు చెల్లించాల్సి వచ్చిందని తెలిపారు. ఇంతటి భారీ అప్పులు కడుతూ కూడా, ప్రజా ప్రభుత్వం ఎక్కడా వెనకడుగు వేయకుండా సంక్షేమ పథకాలను నిరంతరాయంగా అమలు చేస్తోందని స్పష్టం చేశారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యధిక వడ్డీలకు తెచ్చిన అప్పులను ప్రస్తుతం తాము రీస్ట్రక్చరింగ్ చేయిస్తున్నామని.. దీనివల్ల ఏడాదికి కట్టాల్సిన వడ్డీ భారాన్ని రూ.34 వేల కోట్ల నుంచి రూ.11 వేల కోట్లకు తగ్గించగలిగామని వివరించారు. కేసీఆర్, హరీశ్ రావులకు గతం లేదు.. భవిష్యత్ లేదు. అందుకే ఉనికి చాటుకోవడానికి ఇప్పుడు హడావిడి పెంచారు" అని ఎద్దేవా చేశారు.
బొగ్గు మాయంపై విజిలెన్స్ విచారణ..
సింగరేణి సంస్థను బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాటు సంక్షోభంలోకి నెట్టిందని భట్టి విక్రమార్క ఆరోపించారు. "బీఆర్ఎస్ నేతలు సింగరేణి ప్రాంతాల్లో తిరుగుతూ మళ్లీ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. పదేళ్ల కాలంలో సింగరేణిలో కనీసం ఒక్క కొత్త బ్లాక్‌నైనా అందుబాటులోకి తెచ్చారా? ఇన్నాళ్లూ కొత్త బ్లాక్లు రాకుండా అడ్డుకున్నదే బిఆర్ఎస్ నేతలు" అని దుయ్యబట్టారు. సింగరేణి నుంచి కేజీ బొగ్గు కూడా బయటకు వెళ్లే అవకాశం లేదని చెప్తూనే.. గతంలో జరిగిన బొగ్గు మాయం ఆరోపణలపై తాము సీరియస్‌గా ఉన్నామని మంత్రి స్పష్టం చేశారు. దీనిపై ఇప్పటికే సింగరేణి విజిలెన్స్ డైరెక్టర్‌కు పూర్తిస్థాయి విచారణ జరపాలని ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. కొత్త కోల్ బ్లాక్లను సాధించుకునేందుకు ప్రస్తుతం తాము కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని, సింగరేణిని కాపాడుకుంటూనే కార్మికుల ప్రయోజనాలను రక్షిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పునరుద్ఘాటించారు.






