ఇప్పుడు డీజిల్ వంతు.. 15 శాతం ఐసోబ్యూటనాల్ కలుపుతున్నాం : కేంద్రమంత్రి గడ్కరీ

by Naga Rani Yarlagadda |

దేశంలో శిలాజ ఇంజనాల దిగుమతులు (Fossil Fuels imports) తగ్గించడమే లక్ష్యంగా కేంద్రం బయోఫ్యూయల్ విప్లవం వైపు వేగంగా అడుగులు వేస్తోంది.

ఇప్పుడు డీజిల్ వంతు.. 15 శాతం ఐసోబ్యూటనాల్ కలుపుతున్నాం : కేంద్రమంత్రి గడ్కరీ
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో శిలాజ ఇంజనాల దిగుమతులు (Fossil Fuels imports) తగ్గించడమే లక్ష్యంగా కేంద్రం బయోఫ్యూయల్ విప్లవం వైపు వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే E20 పెట్రోల్ ను తీసుకొచ్చిన కేంద్రం డీజిల్ లో 15 శాతం ఐసోబ్యూటనాల్ (Isobutanol) మిశ్రమాన్ని కలిపేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖమంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. సాంప్రదాయమైన జీవ ఇంధనాలతో పోలిస్తే.. ఐసోబ్యూటనాల్ ఎక్కువ ఇంధన సామర్థ్యాన్ని ఇస్తుందని, ప్రస్తుతం డీజిల్ ఇంజన్లకు ఇది సరిగ్గా సరిపోతుందని తెలిపారు. అలాగే తక్కువ కాలుష్య ఉద్గారాలను విడుదల చేస్తుందని స్పష్టం చేశారు. అందుకే దీనిని నెక్స్ట్ జనరేషన్ బయోఫ్యూయల్ గా పరిగణిస్తున్నామన్నారు.

భారతదేశ ప్రత్యామ్నాయ ఇంధన రోడ్ మ్యాప్ గురించి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. పెట్రోల్ లో మాదిరిగా.. డీజిల్ లో ఇథనాల్ నేరుగా కలపడం సాధ్యం కాదని తెలిపారు. ఈ సమస్యకు పరిష్కారంగా ఇథనాల్ ను ఐసోబ్యూటనాల్ గా మార్చే సాంకేతికతపై కసరత్తు జరుగుతోందని, ఇది డీజిల్ కు అత్యంత సమర్థవంతమైన ప్రత్యామ్నాయంగా మారుతుందని పేర్కొన్నారు. డీజిల్ కు ఐసోబ్యూటనాల్ సరైన ప్రత్యామ్నాయమని, ఇప్పటికే నిర్వహించిన పైలట్ ప్రాజెక్టుల్లో ఇది అద్భుతమైన ఫలితాలను ఇచ్చిందన్నారు. రానున్న రోజుల్లో పెద్దఎత్తున దీనిని అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు.

Next Story