- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సిద్ధాపూర్‌లో డంపింగ్ యార్డ్ ప్రతిపాదనను విరమించుకోవాలి
సిద్ధాపూర్‌లో ప్రతిపాదిత (ఎకో టౌన్) డంపింగ్ యార్డ్ ఏర్పాటు ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలని షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే ఎల్గమోని అంజయ్య యాదవ్ డిమాండ్ చేశారు.

దిశ, షాద్ నగర్: సిద్ధాపూర్‌లో ప్రతిపాదిత (ఎకో టౌన్) డంపింగ్ యార్డ్ ఏర్పాటు ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలని షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే ఎల్గమోని అంజయ్య యాదవ్ డిమాండ్ చేశారు. సిద్ధాపూర్‌లో ప్రతిపాదిత (ఎకో టౌన్) డంపింగ్ యార్డ్ స్థలాన్ని అంజయ్య యాదవ్ శనివారం బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. పచ్చని పంటల మధ్య డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతం తీవ్ర కాలుష్యానికి గురై ప్రజల ఆరోగ్యం, వ్యవసాయం, భూగర్భ జలాలపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో పరిశ్రమల అభివృద్ధి కోసం రైతుల నుంచి సేకరించిన భూములను డంపింగ్ యార్డ్‌కు కేటాయించడం దురదృష్టకరమని అన్నారు. ఈ ప్రాంతాన్ని పరిశ్రమలు, వ్యవసాయ అభివృద్ధికి ఉపయోగించాల్సింది పోయి హైదరాబాద్ చెత్తను తరలించే కేంద్రంగా మార్చడం సరికాదని పేర్కొన్నారు. డంపింగ్ యార్డ్ ఏర్పాటైతే సిద్ధాపూర్‌తో పాటు పరిసర గ్రామాలు కూడా కాలుష్యానికి గురవుతాయని, భూముల విలువలు పడిపోవడంతో పాటు ప్రజలు అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. ప్రభుత్వం వెంటనే ఈ ప్రతిపాదనను విరమించుకోవాలని లేనిపక్షంలో గాంధేయ మార్గంలో ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని, అవసరమైతే న్యాయస్థానాన్ని సైతం ఆశ్రయిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ పోరాటం రాజకీయాలకు అతీతంగా ప్రజల భవిష్యత్తు కోసం జరుగుతోందని, ప్రతి ఒక్కరూ కలిసి డంపింగ్ యార్డ్ ఏర్పాటును అడ్డుకోవాలని అంజయ్య యాదవ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు వంకాయల నారాయణరెడ్డి, రాంబల్ నాయక్, శ్రీనివాస్ గౌడ్,బిఆర్ఎస్ నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.






