నరికేయడం.. వదిలేయడం.. తొలగించకుంటే జరినామా విధించే ఛాన్స్

by Kodari Anjali |

విద్యుత్ శాఖ నిర్లక్ష్యం.. ప్రజలకు శాపంగా మారింది.

నరికేయడం.. వదిలేయడం.. తొలగించకుంటే జరినామా విధించే ఛాన్స్
X

దిశ, మేడ్చల్ బ్యూరో: విద్యుత్ శాఖ నిర్లక్ష్యం.. ప్రజలకు శాపంగా మారింది. కరెంట్ వైర్లకు తగులుతున్నాయన్న కారణంతో విద్యుత్ శాఖ అధికారులు కాంట్రాక్టర్లతో చెట్ల కొమ్మలు కొట్టేపిస్తున్నారు. అయితే నరికివేసిన చెట్లు, కొమ్మలు ఎక్కడివి అక్కడే వదిలివేయడంతో మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా పరిధిలో చాలా చోట్ల చెట్ల కొమ్మలు ఎండిపోయి రోడ్డు పక్కన కుప్పలుగా కనిపిస్తున్నాయి. రోడ్లకు అడ్డంగా ఉండి నరికివేసిన చెట్ల కొమ్మలు పెద్ద ఎత్తున పేరుకుపోవడంతో జనం ప్రమాదాల భారీన పడుతున్నారు. చెట్ల కొమ్మలను శాస్త్రీయ పద్దతిలో కాకుండా ఇష్టానుసారంగా కత్తిరించడం వల్లనే గాలి వానలకు చెట్లు, భారీ కొమ్మలు విరిగిపడుతున్నాయి.

ఆ బాధ్యత కాంట్రాక్టర్లదే..

వర్షానికి పడిపోయిన చెట్ల తొలగింపు బాధ్యతను ఎంఎంసీలో అర్బన్ బయో డైవర్సిటీ, పారిశుధ్య, డీఆర్ఎఫ్ బలగాలు సంయక్తంగా నిర్వహిస్తాయి. చెట్టు పడిపోయిందని ఎంఎంసీ కాల్ సెంటర్‌కు సమచారం రాగానే స్థానిక ఉన్న మాన్ సూన్ యాక్షన్ టీంలు రంగంలోకి దిగుతాయి. విద్యుత్ శాఖలో మాత్రం ప్రత్యేకంగా కాంట్రాక్టర్ కు నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. కరెంట్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించి తరలించాల్సి ఉంటుంది. ఎక్కడైనా కాంట్రాక్టర్ తొలగించకుండా రోడ్లపై పడేస్తే జరినామా విధించే నిబంధన కూడా ఉంది.

అశాస్త్రీయంగా నరికేయడం వల్లనే.

కరెంట్ వైర్ల కింద ఉన్న చెట్ల కొమ్మలను మాత్రమే తొలగిస్తూ.. మిగితా చెట్టుకు ఉన్న కొమ్మలను కట్ చేయకుండా వదిలేస్తున్నారు. చెట్ల కొమ్మల తొలగింపులో సమతూకం విధానం అనుసరించడంలేదు. అశాస్త్రీయంగా కొమ్మలు నరకడం వల్ల చెట్టు సమతుల్యత దెబ్బతింటుంది. ఒకవైపు బరువు ఎక్కువై,మరో వైపు బరువు తగ్గిపోవడం వల్ల బలహీనపడతాయి. దీనికి తోడు వర్షాలకు నేల మెత్తబడి, చెట్టు వేర్ల పట్టు సడలిపోవడం వల్ల చెట్లు కూలిపోతుంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనికి తోడు నగరంలో రోడ్ల పక్కన భవనాలు, వాటి పునాదాలు,డ్రైనేజీలు, సీసీ రోడ్లు తదితర అడ్డంకులతో చెట్లను బలంగా నిలిపే వేర్ల వ్యవస్థ బలంగా ఉండటం లేదు. దీంతో మహా వృక్షాలు సైతం కొద్దిపాటి గాలులు, వర్షాలకే నేలకొరుగుతున్నాయి.

అనుభవంలేని వారితో పనులు..

రోజుకు వీలైనన్ని ఎక్కువ కొమ్మలను నరకాలనే ధోరణిలో ఎలక్ట్రికల్ డిపార్ట్‌మెంట్ లు కొమ్మలను తొలగిస్తున్నాయి.చెట్టు బరువు అన్ని వైపులా సమనంగా ఉండే విధంగా చూసుకోవాలి. అనుభవం, అవగాహన లేని కాంట్రాక్టర్లు సిబ్బంది ప్రూనింగ్ ప్రక్రియ చేపట్టడంతో పచ్చదనం క్రమంగా తగ్గిపోతుందని పర్యావరణ నిపుణులు తెలియజేస్తున్నారు. ఈ విధంగా మొక్కలను విచక్షణా రహితంగా నరకడం వల్ల రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెట్ల తొలగింపునకు సరైన విధానాన్ని అనుసరించాలని కోరుతున్నారు.

తలనొప్పిగా...

విద్యుత్ శాఖ నిర్లక్ష్యం తలనొప్పిగా మారిందని మల్కాజిగిరి నగర పాలక సంస్థ (ఎంఎంసీ)లోని ఓ సీనియర్ అధికారి వ్యాఖ్యనించారు. కరెంట్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్లు, కొమ్మలను నరికేసి చేతులు దులుపుకుంటున్నారని అసంతృప్తి వ్యక్తంచేశారు. వర్షాకాలానికి నెల రోజుల ముందు నుంచే మెయిన్ రోడ్లు, అంతర్గత రహదారుల వెంట స్తంభాలు, తీగలకు అనుకుని ఉన్న చెట్ల కొమ్మలను విద్యుత్ శాఖ కట్ చేయించింది. వాటిని తరలించాల్సిన కాంట్రాక్టర్లు పట్టించుకోకపోవడంతోనే ఇదంతా జరుగుతున్నట్లు సదరు ఆఫీసర్ వాపోయారు. విద్యుత్ శాఖ కాంట్రాక్టర్ల వ్యవహార తీరుపై ఆ శాఖ ఉన్నతాధికారులకు లేఖ రాయనున్నట్లు తెలిపారు.

తొలగించాలని కాంట్రాక్టర్లను ఆదేశిస్తాం..వెంకన్న

విద్యుత్ వైర్ల కింద ఉన్న చెట్ల కొమ్మలను నరికివేయడంతో పాటు తొలగించే బాధ్యత కూడా కాంట్రాక్టర్లదే.. చెట్ల కొమ్మలను తొలగించాలని ఇప్పటికే కాంట్రాక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. కాంట్రాక్టర్లు నరికివేసి, అక్కడి నుంచి తొలగించకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.. కాకపోతే హరితహారంలో విద్యుత్ వైర్ల కింద మొక్కలు నాటకుండా ఆయా శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలి.

-వెంకన్న, ఎస్ఈ, విద్యుత్ శాఖ

Next Story