కాలానుగుణ వ్యాధులు వ్యాపించకుండా తగు చర్యలు తీసుకోవాలి: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి

by Kodari Anjali |

పంట మార్పిడి, ఆయిల్ పామ్ పంటల సాగును ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సూచించారు.

కాలానుగుణ వ్యాధులు వ్యాపించకుండా తగు చర్యలు తీసుకోవాలి: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
X

దిశ, మహబూబాబాద్ టౌన్: పంట మార్పిడి విధానాలు, ఆయిల్ పామ్ పంటల సాగు విస్తీర్ణం పెంచేలా రైతులను అధికారులు ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు.శనివారం, హైదరాబాదులోని రాష్ట్ర సచివాలయం నుంచి సీఎస్ సంజయ్ జాజు అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ సబందిత అధికారులతో హాజరయ్యారు.ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 2026 - 27 సంవత్సరానికి 85 వేల ఎకరాలలో ఆయిల్ పామ్ పంట సాగు చేసేందుకు లక్ష్యంగా నిర్దేశించామన్నారు. దీనికి అనుగుణంగా జిల్లాలలో అధికారులు చొరవ తీసుకోవాలన్నారు. పంట మార్పిడి విధానాలను అవలంబించాలన్నారు. కూరగాయల సాగు వైపు దృష్టి సారించాలని వివరించారు. సూక్ష్మ సేద్య పద్ధతులు రైతులు పాటించేలా వారిని ప్రోత్సహించాలని తెలిపారు.యూరియా, డిఎపి, ఇతర కాంప్లెక్స్ ఎరువులన్నీ రైతులకు సరిపడినన్ని అందించాలన్నారు. ఎరువులను పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాల కలెక్టర్లు స్వయంగా ఈ అంశంపై పటిష్ట నిఘా ఉంచాలని వివరించారు. ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.

రైతుల అవసరాల మేరకు...

జిల్లాల వారీగా ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియను సమీక్షిస్తూ, దేశంలోనే ఫార్మర్ రిజిస్ట్రీలో తెలంగాణ రాష్ట్రం 71.45 శాతంతో మొదటి స్థానంలో ఉందన్నారు. వర్షాకాలం కాలానుగుణ వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని, అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, తదితర వ్యాధులు వ్యాపించకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ అనంతరం సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ మాట్లాడుతూ.. జిల్లాలో ఆయిల్ పామ్ పంటల సాగు విస్తీర్ణం పెంచేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. రైతుల అవసరాల మేరకు యూరియాను అందించాలని, యూరియా పక్కదారి పట్టకుండా పటిష్ట నిఘా వ్యవస్థ ఏర్పాటు చేయాలని తెలిపారు. కాలానుగుణ వ్యాధులు వ్యాప్తి చెందకుండా తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.ఈ వీసీలో రెవెన్యు అదనపు కలెక్టర్ కె. అనిల్ కుమార్, స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్, జెడ్.పి సీ.ఈ.ఓ పురుషోత్తం, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి జినుగు మరియన్న, జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణ మూర్తి, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి మధార్, జిల్లా వైద్య శాఖ అధికారి డా. రవి రాథోడ్, సి.పి.ఓ శ్రీనివాస రావు, మిషన్ భగీరధ్, ఇరిగేషన్, వ్యవసాయ శాఖ ఇతర సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Next Story