డిప్యూటీ తహసీల్దార్ ఏ అశోక్ కుమార్ సస్పెన్షన్..

by Kodari Anjali |

పట్టాదారు భూమిని ప్రభుత్వ అసైన్డ్ భూమిగా రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేసిన ఘటనపై జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ సీరియస్‌గా స్పందించారు.

డిప్యూటీ తహసీల్దార్ ఏ అశోక్ కుమార్ సస్పెన్షన్..
X

దిశ, అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం హాజీపూర్ గ్రామానికి చెందిన రైతు జంచుక మసన్న జీవించి ఉండగానే ఆయన మరణించినట్లు తప్పుడు పత్రాలు సృష్టించి, రైతుకు తెలియకుండానే ఆయన పట్టాదారు భూమిని ప్రభుత్వ అసైన్డ్ భూమిగా రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేసిన ఘటనపై జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ సీరియస్‌గా స్పందించారు. బాధిత రైతు ఫిర్యాదు మేరకు పూర్తి స్థాయి విచారణ చేపట్టించిన కలెక్టర్, విచారణలో వెలుగులోకి వచ్చిన వాస్తవాల ఆధారంగా బాధ్యులపై కఠిన శాఖాపరమైన చర్యలు తీసుకుంటూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. విచారణలో అచ్చంపేట తహసీల్దార్ కార్యాలయంలో భూభారతి ఆపరేటర్‌గా పనిచేస్తున్న మూడవత్ జైపాల్ విధి నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించినట్లు తేలడంతో ఆయనను వెంటనే విధుల నుంచి తొలగించడంతోపాటు అతనిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. అదే సమయంలో ఘటన జరిగిన సమయంలో అచ్చంపేట తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్‌గా విధులు నిర్వహించి, ప్రస్తుతం పెద్దకొత్తపల్లి తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ (డిప్యుటేషన్)గా పనిచేస్తున్న ఎ. అశోక్ కుమార్ పై కూడా విచారణలో తీవ్ర నిర్లక్ష్యం నిర్ధారణ కావడంతో ఆయనను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ నిర్లక్ష్యం కారణంగానే...

జిల్లా కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, తెలంగాణ భూ-భారతి (రికార్డ్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్) రూల్స్–2025 ప్రకారం వారసత్వ మార్పిడి (Succession Mutation) కేసుల్లో దరఖాస్తుదారులు సమర్పించిన పత్రాలను పూర్తిస్థాయిలో పరిశీలించి, రిజిస్ట్రేషన్ చట్టం–1908, భూ-భారతి నిబంధనల ప్రకారం ధ్రువీకరించాల్సిన బాధ్యత సంబంధిత అధికారిపై ఉందన్నారు. అయితే ఎ. అశోక్ కుమార్ సమర్పించిన పత్రాలను సమగ్రంగా పరిశీలించకుండా, తగిన ధ్రువీకరణ లేకుండానే వారసత్వ మార్పిడి ప్రక్రియను పూర్తి చేయడం ద్వారా నిబంధనలను ఉల్లంఘించినట్లు విచారణలో తేలిందని కలెక్టర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నిర్లక్ష్యం కారణంగానే జీవించి ఉన్న రైతును మృతుడిగా చూపిస్తూ రికార్డుల్లో మార్పులు జరిగాయని, ఫలితంగా రైతు పట్టాదారు భూమి ప్రభుత్వ అసైన్డ్ భూమిగా నమోదై రైతు హక్కులకు తీవ్ర భంగం కలిగిందని విచారణలో వెల్లడైందన్నారు.

ప్రాథమిక నిబంధనల ప్రకారం..

సస్పెన్షన్ కాలంలో ఆయనకు నిబంధనల ప్రకారం ప్రాథమిక వేతనం, అలవెన్సులలో 50 శాతం జీవనభృతి (Subsistence Allowance) చెల్లించనున్నట్లు ఉత్తర్వుల్లో వెల్లడించారు. అలాగే విచారణ పూర్తయ్యే వరకు నాగర్‌కర్నూల్ జిల్లానే ఆయన ప్రధాన కేంద్రంగా ఉంటుందని, జిల్లా కలెక్టర్ అనుమతి లేకుండా ప్రధాన కేంద్రాన్ని విడిచి వెళ్లరాదని ఆదేశించారు. ప్రతి నెలా ఇతర ఉద్యోగం చేయడం లేదని ధ్రువీకరణ పత్రాన్ని జిల్లా ట్రెజరీ అధికారికి సమర్పించాలని కూడా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రైతుల భూ హక్కులకు భంగం కలిగించే విధంగా వ్యవహరించే అధికారులు, సిబ్బందిపై ఎలాంటి రాజీ ఉండదని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ స్పష్టం చేశారు. రెవెన్యూ రికార్డుల నిర్వహణలో పారదర్శకత, బాధ్యత, నిబంధనల అమలు తప్పనిసరి అని, నిర్లక్ష్యం లేదా అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు.

Next Story