- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సంస్థ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తాం : కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి
సింగరేణి వేలం పాట ద్వారా కొత్త గనులు సాధించి పెరుగుతున్న దేశ ఇంధన అవసరాలకు తోడ్పాటును అందించాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు.

దిశ, కొత్తగూడెం సింగరేణి : సింగరేణి వేలం పాట ద్వారా కొత్త గనులు సాధించి పెరుగుతున్న దేశ ఇంధన అవసరాలకు తోడ్పాటును అందించాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్లోని సింగరేణి భవన్లో ఆయన సింగరేణి సంస్థ పనితీరు, భవిష్యత్ కార్యాచరణపై సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన సింగరేణి గనుల ఉత్పత్తి, రవాణా, ఓవర్ బారదేన తొలగింపునకు సంబంధించిన వివరాలను కొత్త గనులు వాటి ఉత్పత్తి వివరాలు, అనుమతుల స్థితిగతులపై గనుల వారీగా కూలంకశంగా సమీక్షించారు. సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తి పెంచడం కోసం అవసరమైన కొత్త బ్లాక్ల ను బొగ్గు శాఖ నిర్వహించే వేలం పాటలో పాల్గొని సాధించాలని సూచించారు. దేశంలో విద్యుత్ అవసరాలు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో రానున్న 10 నుంచి 15 సంవత్సరాలకు అనుగుణంగా సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని ఆదేశించారు. దేశ ఇంధన రంగంలో ఇంకా సుదీర్ఘ కాలం బొగ్గు కీలక పాత్ర పోషించనున్నదని కనుక బొగ్గు ఉత్పత్తిని గణనీయంగా పెంచడంపై దృష్టి సారించాలని, ఉత్పత్తి వ్యయాన్ని తగ్గిస్తూ, పని సామర్థ్యాన్ని మరింతగా పెంచే చర్యలు చేపట్టాలని సూచించారు. సంస్థ వాణిజ్యపరమైన విజయాలకే పరిమితం కాకుండా దేశ భవిష్యత్ ఇంధన అవసరాలను దృష్టిలో ఉంచుకుని దీర్ఘకాలిక వ్యూహాలతో ముందుకు సాగాలని ఆయన సూచించారు.
ఎల్నినో ప్రభావానికి ముందస్తు ప్రణాళిక అవసరం
ప్రపంచ వ్యాప్తంగా మరియు భారత దేశంలో ఎల్ నినో ప్రభావం తీవ్రంగా ఉండనున్న నేపథ్యంలో వ్యవసాయ, ఇతర పారిశ్రామిక రంగాల్లో విద్యుత్ వినియోగం తీవ్రంగా పెరిగే అవకాశం ఉన్నందున విద్యుత్ ఉత్పాదనకు తగినంత బొగ్గు అందించడానికి కోలిండియా తోపాటు సింగరేణి కూడా సంసిద్ధంగా ఉండాలని శ్రీ జి.కిషన్ రెడ్డి పేర్కొన్నారు. రానున్న రోజుల్లో విద్యుత్ అవసరాలు పెరగనున్న నేపథ్యంలో బొగ్గు ఉత్పత్తి, సరఫరా వ్యవస్థలను ముందుగానే బలోపేతం చేసి విద్యుత్ ఉత్పత్తికి నిరంతర ఇంధన సరఫరా ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు. బొగ్గు ఉత్పత్తి పెంపుకు అనుగుణంగా రవాణా వ్యవస్థను కూడా బలోపేతం చేయాలని మంత్రి ఆదేశించారు. రవాణా కాంట్రాక్టులను అత్యంత వేగంగా ఖరారు చేసి అమలు చేయడం ద్వారా అదనపు ఉత్పత్తి సకాలంలో వినియోగదారులకు చేరేలా చూడాలని సూచించారు.
ఉద్యోగులే సంస్థ బలం ..
సింగరేణి అభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర అత్యంత కీలకమని మంత్రి పేర్కొన్నారు. సంస్థ భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికల్లో ఉద్యోగులను భాగస్వాములుగా చేసుకుని వారి విశ్వాసాన్ని మరింత పెంపొందించాలని సూచించారు. ప్రతీ ఉద్యోగి సంస్థ విజయాన్ని తన విజయంగా భావించేలా యాజమాన్యం చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్దప్రకాష్ జ్యోతి సమావేశానికి ఆహ్వానం పలుకుతూ... సింగరేణి లో బొగ్గు ఉత్పత్తి, రవాణా, ప్రస్తుత సవాళ్లను వివరించారు. కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడంలో ఎదురవుతున్న పలు సవాళ్లను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా సింగరేణికి సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ స్టేటస్
తొలగించడం వల్ల అటవీ భూ సేకరణ విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ఈ అంశంపై అతి త్వరలోనే సానుకూల నిర్ణయం వచ్చేలా చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఒడిశా రాష్ట్రంలోని నైనీ బొగ్గు గనిలో ఉత్పత్తి అవుతున్న బొగ్గు రవాణా విషయంలో ఉన్న సమస్యలను తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడతామని ఆయన హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో కేంద్ర బొగ్గు శాఖ కార్యదర్శి విక్రమ్ దేవ్ దత్, సంయుక్త కార్యదర్శి సంజీవ్ కుమార్ కస్సి, కేంద్ర బొగ్గు శాఖ మంత్రి ప్రైవేట్ సెక్రటరీ పంకజ్ జైన్, బొగ్గు శాఖ సలహాదారులు వీరా రెడ్డి, సింగరేణి డైరెక్టర్లు ఎల్ వి సూర్యనారాయణ, కె.వెంకటేశ్వర్లు, గౌతమ్ పోట్రు, ఎం.తిరుమలరావు, ఈడీ(కోల్ మూవ్మెంట్) బి.వెంకన్న, జీఎం(కో ఆర్డినేషన్, మార్కెటింగ్) టి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.






