అక్రమంగా రవాణా చేస్తున్న గంజాయి పట్టివేత

by Batti.Sumithra |

ఒడిశా రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా నంద్యాలకు అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఓ కారును ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రేజర్ల గ్రామం వద్ద పోలీసులు పట్టుకున్నారు.

అక్రమంగా రవాణా చేస్తున్న గంజాయి పట్టివేత
X

దిశ, సత్తుపల్లి : ఒడిశా రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా నంద్యాలకు అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఓ కారును ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రేజర్ల గ్రామం వద్ద పోలీసులు పట్టుకున్నారు. సత్తుపల్లి టౌన్ సీఐ టి. శ్రీహరి తెలిపిన వివరాల ప్రకారం ఒడిశా రాష్ట్రం మల్కాన్‌గిరి జిల్లా దొరగూడ గ్రామానికి చెందిన ప్రబిన్ ఖాత్రా అనే టాక్సీ డ్రైవర్ ఈ నెల 3వ తేదీ తెల్లవారుజామున దారకొండ జంక్షన్ నుంచి బయలుదేరాడు. రాజమండ్రి మీదుగా గ్రీన్‌ఫీల్డ్ హైవేలో హైదరాబాద్‌కు వెళ్తుండగా, మార్గమధ్యంలో హైవేపై పోలీసులు తనిఖీలు నిర్వహించే అవకాశం ఉందని భావించి, గ్రీన్‌ఫీల్డ్ హైవే నుంచి దిగి సత్తుపల్లి మీదుగా వెళ్లాలని నిర్ణయించుకున్నాడు.

ఈ క్రమంలో టయోటా కారులో సత్తుపల్లి వైపు వస్తుండగా, విశ్వసనీయ సమాచారం మేరకు ఏసీపీ వసుంధర యాదవ్ పర్యవేక్షణలో ఈగల్ బృందం, సత్తుపల్లి ఎస్సై వీరప్రసాద్, ఎస్సై ప్రదీప్‌లు వాహనాల తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పదంగా కనిపించిన కారును తనిఖీ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారించగా, కారు డిక్కీలో 166 కిలోల 360 గ్రాముల గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. ఈ కేసులో ఒడిశా రాష్ట్రానికి చెందిన బికారి అలియాస్ రోహన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా నంద్యాల మండలం బేతంచెర్ల గ్రామానికి చెందిన చుక్కా నాగేశ్వరరావు గౌడ్ కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు రూ. 89.13 లక్షల విలువైన 166 కిలోల 360 గ్రాముల గంజాయి, టయోటా కారు, రూ. 500 నగదు, ఒక సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అదుపులో ఉన్న నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

Next Story