రాజకీయ ఉచ్చులో పడి.. భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు!

by Naga Rani Yarlagadda |

కొందరు స్వార్థ రాజకీయ నాయకులు, అసాంఘిక శక్తులు పన్నుతున్న ఉచ్చులో పడి తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని నిరుద్యోగ యువతకు తెలంగాణ రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు వై. గోపిరెడ్డి హెచ్చరించారు.

రాజకీయ ఉచ్చులో పడి.. భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు!
X
  • ఆవేశంలో కేసులు నమోదైతే ప్రభుత్వ ఉద్యోగానికే అనర్హులు
  • తొలిదశలో 5 వేల పోలీస్ పోస్టులు
  • త్వరలోనే మరో 2 వేల పోస్టులకు నోటిఫికేషన్
  • ఒకేసారి పోస్టుల భర్తీతో శిక్షణ, ప్రమోషన్ల సమస్యలు
  • తెలంగాణ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు వై. గోపిరెడ్డి

దిశ, తెలంగాణ బ్యూరో: కొందరు స్వార్థ రాజకీయ నాయకులు, అసాంఘిక శక్తులు పన్నుతున్న ఉచ్చులో నిరుద్యోగులు పడి తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని పోలీసు ఉద్యోగాల కోసం అహర్నిశలు శ్రమిస్తున్న నిరుద్యోగ యువతకు తెలంగాణ రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు వై. గోపిరెడ్డి హెచ్చరించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆవేశంలో రోడ్డెక్కి, ఆందోళనలకు దిగి కేసులు ఎదుర్కొంటే.. జీవితంలో ఏ ప్రభుత్వ ఉద్యోగానికీ పనికిరాకుండా పోతారని స్పష్టం చేశారు.

కేసులు నమోదైతే కలలు కల్లలే

ఎన్నికల లబ్ధి, స్వప్రయోజనాల కోసం కొందరు ఉద్దేశపూర్వకంగా నిరుద్యోగులను రోడ్లపైకి లాగుతున్నారని గోపిరెడ్డి అన్నారు.. నిరసనల్లో పాల్గొని శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు. ఆవేశంలో చేసే చిన్న పొరపాటు వల్ల మీపై ఒక్కసారి క్రిమినల్ కేసు నమోదైతే.. క్యారెక్టర్ వెరిఫికేషన్ సమయంలో అనర్హత వేటు పడుతుంది. దీంతో పోలీసు కొలువు సాధించాలన్న మీ కలలు కల్లలవుతాయి. కాబట్టి యువత విచక్షణతో వ్యవహరించి, రాజకీయ కుతంత్రాలకు బలికావద్దు అని ఆయన హితవు పలికారు. రిక్రూట్‌మెంట్‌ బోర్డు పారదర్శకంగా, కేవలం ప్రతిభ ఆధారంగానే ఎంపిక చేస్తుందని, అడ్డదారుల గురించి ఆలోచించవద్దని స్పష్టం చేశారు.

దశలవారీగా భర్తీ.. త్వరలో మరో 2 వేల కొలువులు

ఈ 5 వేల పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతుండగానే.. దానికి కొనసాగింపుగా రెండో దశ కింద త్వరలోనే మరో 2 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రానుందని వెల్లడించారు. ప్రభుత్వం నిరంతరాయంగా చేపడుతున్న ఈ నియామకాల ప్రక్రియను అర్థం చేసుకోకుండా కొందరు అభ్యర్థులను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. అభ్యర్థులు వదంతులు నమ్మకుండా తక్షణమే ప్రిపరేషన్ ప్రారంభించాలని సూచించారు.

ఒకేసారి భర్తీ చేస్తే సమస్యలు

పోలీసు ఖాళీలన్నింటినీ ఒకేసారి ఎందుకు భర్తీ చేయరు.. ఒకే విడతలో భారీగా రిక్రూట్‌మెంట్ జరిగితే.. ఎంపికైన వారికి నాణ్యమైన శిక్షణ ఇవ్వడం కష్టమవుతుందన్నారు. రాష్ట్రంలోని పోలీస్ ట్రైనింగ్ కాలేజీల సామర్థ్యానికి మించి అభ్యర్థులు వస్తే వసతులు, ప్రయోగాత్మక శిక్షణ అందించలేం. సరైన నైపుణ్య శిక్షణ లేకపోతే నేర పరిశోధన, శాంతిభద్రతల నిర్వహణలో ఇబ్బందులు వస్తాయి. మరోవైపు ఒకేసారి పెద్ద బ్యాచ్‌గా ఉద్యోగాల్లో చేరితే.. భవిష్యత్తులో వారికి పదోన్నతులు ప్రమోషన్లు ఇచ్చేటప్పుడు సీనియారిటీ వివాదాలు, చిక్కులు ఎదురవుతాయి. అందరికీ ఒకేసారి ప్రమోషన్లు రాక సిబ్బందిలో అసంతృప్తి పెరుగుతుంది. ఈ సమస్యలన్నింటినీ దృష్టిలో ఉంచుకునే.. అభ్యర్థుల కెరీర్‌కు నష్టం వాటిల్లకూడదన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం విడతల వారీగా భర్తీకి మొగ్గుచూపుతోంది అని గోపిరెడ్డి వివరించారు.

Next Story