- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మో"డల్' గా మార్కెట్ వ్యాపారాలు
ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో నిర్మించిన మోడల్ కూరగాయల మార్కెట్ ప్రస్తుతం వ్యాపారులకు మాత్రం ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దిశ, ఇల్లెందు : ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో నిర్మించిన మోడల్ కూరగాయల మార్కెట్ ప్రస్తుతం వ్యాపారులకు మాత్రం ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలుదారుల రాక లేకపోవడంతో వ్యాపారాలు పూర్తిగా దెబ్బతిన్నాయని అంటున్నారు. ముఖ్యంగా మహిళా కూరగాయల వ్యాపారులు రోజూ తెచ్చిన కూరగాయలు అమ్ముడుపోక పాడైపోతుండటంతో తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నామని వాపోతున్నారు.
కొనుగోలుదారులు కరువు... కూరగాయల పారబోత
కొత్త మార్కెట్ పట్టణ నడిబొడ్డున ఉన్నప్పటికీ బిల్డింగ్ వ్యాపారానికి అనుగుణంగా ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల కొనుగోలుదారులు పెద్దగా రావడం లేదని వ్యాపారులు చెబుతున్నారు. దీంతో ప్రతి రోజూ వేల రూపాయల విలువైన కూరగాయలు, ఆకుకూరలు అమ్ముడుపోక పాడైపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పులు చేసి సరుకు తీసుకొస్తే పెట్టుబడే తిరిగి రావడం లేదని పలువురు మహిళా వ్యాపారులు కన్నీటి పర్యంతమవుతున్నారు.
పాత మార్కెట్‌లోనే వ్యాపారాలకు అవకాశం కల్పించాలి..
ఏళ్ల తరబడి పాత మార్కెట్‌లో వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్న తమను ఒక్కసారిగా కొత్త మార్కెట్‌కు తరలించడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని వ్యాపారులు పేర్కొంటున్నారు. ప్రజలకు అలవాటు అయిన పాత మార్కెట్‌లోనే వ్యాపారాలు కొనసాగించేందుకు అవకాశం కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కొత్త మార్కెట్ పూర్తిగా ప్రజలకు అలవాటు పడే వరకు రెండు ప్రాంతాల్లో వ్యాపారాలకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు.
కొంతమందికి లాభం... చాలా మందికి నష్టం..
కొత్త మార్కెట్‌లో కొద్దిమంది వ్యాపారులకు మాత్రమే వ్యాపారం సవ్యంగా సాగుతుండగా, ఎక్కువ మంది మాత్రం తీవ్ర నష్టాలు చవిచూస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. మార్కెట్‌లో అన్ని షాపులకు సమానంగా కొనుగోలుదారులు రావడం లేదని, దీంతో కొంతమందికే లాభం చేకూరుతుండగా మిగతా వ్యాపారులు నష్టాల్లో కూరుకుపోతున్నారని అంటున్నారు.
ఎమ్మెల్యే, చైర్‌పర్సన్‌కు విన్నవించిన వ్యాపారులు..
తమ సమస్యలను ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్‌పర్సన్ దృష్టికి తీసుకెళ్లామని వ్యాపారులు తెలిపారు. వ్యాపారుల పరిస్థితిని అర్థం చేసుకుని తమకు న్యాయం చేయాలని, జీవనోపాధి దెబ్బతినకుండా తగిన నిర్ణయం తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
మార్కెట్‌ను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్..
వ్యాపారుల నుంచి వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో మున్సిపల్ కమిషనర్ మార్కెట్‌ను సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. వ్యాపారులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రజల రాక పెరిగేలా తీసుకోవాల్సిన చర్యలు, వ్యాపారులకు ఇబ్బందులు తగ్గించే మార్గాల పై ఉన్నతాధికారులతో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు సమాచారం.
వ్యాపారుల ఆశలు నెరవేరేనా ?
ప్రభుత్వం మంచి ఉద్దేశంతో నిర్మించిన మోడల్ మార్కెట్ నిజంగా ఆదర్శంగా నిలవాలంటే ముందుగా వ్యాపారులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ప్రజలకు సౌకర్యాలు, వ్యాపారులకు ఉపాధి రెండూ సమానంగా ఉండేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో వ్యవహరిస్తేనే మోడల్ మార్కెట్ లక్ష్యం నెరవేరుతుందని వ్యాపారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.






