BJP ఎమ్మెల్యేకు నాలుగేళ్ల జైలు శిక్ష.. లేడీ డాక్టర్ మరణం కేసులో హైకోర్టు కీలక తీర్పు

by Prasad Jukanti |   (  Updated:2026-07-04 13:28:37  IST  )

2018లో మహిళ డాక్టర్ మరణించిన కేసులో బీజేపీ ఎమ్మెల్యేకు జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది.

BJP ఎమ్మెల్యేకు నాలుగేళ్ల జైలు శిక్ష.. లేడీ డాక్టర్ మరణం కేసులో హైకోర్టు కీలక తీర్పు
X

దిశ, డైనమిక్ బ్యూరో: బిహార్ బీజేపీ ఎమ్మెల్యే రాజు కుమార్ సింగ్‍కు జైలు శిక్ష ఖరారైంది. డాక్టర్ అర్చన గుప్త మృతికి కారణమైన 2018 నాటి కేసులో ఢిల్లీ హైకోర్టు ఆయనకు 4 ఏళ్ల జైలుశిక్షతో పాటు రూ.25 లక్షల జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని డాక్టర్ అర్చన భర్త వికాస్ గుప్తాకు చెల్లించాలని ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ గోగ్నే నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఈ కేసులో రాజ్ కుమార్ సింగ్ ను కోర్టు జూన్ 6వ తేదీన దోషిగా నిర్దారించగా ఇవాళ శిక్ష ఖరారు చేసింది. అయితే ఈ కేసులో ఎమ్మెల్యే రాజ్ కుమార్ సింగ్ భార్య సహా మరో ముగ్గురిని కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.

అసలు ఏం జరిగిందంటే..?

బీహార్‌లోని సాహెబ్‌గంజ్ నియోజకవర్గ సిట్టింగ్ బీజేపీ ఎమ్మెల్యే రాజు కుమార్ సింగ్ సోదరుడు 2018 డిసెంబర్ 31న (న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా) దక్షిణ ఢిల్లీలోని ఫతేపూర్ బేరి ప్రాంతంలో ఉన్న ఒక ఫామ్‌హౌస్‌లో విందు ఏర్పాటు చేశారు. ఈ పార్టీలో ఎమ్మెల్యే రాజు కుమార్ సింగ్ సరదాగా గాల్లోకి కాల్పులు జరిపారు. అయితే ఆయన గాల్లోకి కాల్చిన బుల్లెట్ వేడుకకు హాజరైన వికాస్ గుప్తా భార్య అర్చన గుప్తా (45)కు బలంగా తగిలింది. తీవ్ర గాయాలపాలైన ఆమె ఆ తర్వాత చికిత్స పొందుతూ మరణించారు.

కోర్టులో ఎమ్మెల్యే వింత వాదన.. దక్కని ఫలితం:

ఈ కేసులో గత నెల జూన్ 6న ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ గోగ్నే నేతృత్వంలోని రౌస్ ఎవెన్యూ కోర్టు ఎమ్మెల్యేను దోషిగా నిర్ధారించింది. అయితే తనకు జైలు శిక్ష విధించవద్దని శుక్రవారం ఎమ్మెల్యే రాజు కుమార్ సింగ్ కోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా ఆయన తనకు శాస్త్రీయ పరిజ్ఞానం లోపించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఒక వింత వాదనను కోర్టు ముందుంచారు. గాల్లోకి కాల్చిన బుల్లెట్ పారాబోలిక్ పథం (Parabolic Trajectory )లో ప్రయాణించి కింద ఉన్నవారికి తగులుతుందనే విషయం తాను ఊహించలేకపోయాని అందువల్ల శిక్ష నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరాడు. అయితే ఎమ్మెల్యే వాదనలను తోసిపుచ్చిన ప్రత్యేక న్యాయమూర్తి ఎమ్మెల్యే రాజు కుమార్ సింగ్ కు జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తూ శనివారం తీర్పును వెలువరించారు.

Next Story