- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్‌కు మళ్లీ బెయిల్ నిరాకరణ
2020 నాటి ఢిల్లీ అల్లర్ల కుట్ర కేసులో యాక్టివిస్టులు ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్‌కు బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ కోర్టు నిరాకరించింది.

దిశ, నేషనల్ బ్యూరో : ఉపా చట్టం కింద నమోదైన 2020 నాటి ఈశాన్య ఢిల్లీ అల్లర్ల వెనుక పెద్ద ఎత్తున కుట్ర జరిగిందనే కేసులో ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను ఢిల్లీ కోర్టు శనివారం తిరస్కరించింది. ట్రయల్ ప్రారంభం కాకుండానే తమను నిరంతరాయంగా జైల్లో ఉంచడం వల్ల తమ ప్రాథమిక వ్యక్తిగత స్వేచ్ఛా హక్కుకు భంగం కలుగుతోందనే ప్రాతిపదికన ఖలీద్, ఇమామ్ బెయిల్ కోరారు. తన మునుపటి పిటిషన్ సుప్రీంకోర్టు తిరస్కరించినప్పటికీ, ఆ తర్వాతి కాలంలో జరిగిన న్యాయపరమైన పరిణామాలు పరిస్థితుల్లో మార్పునకు దారితీశాయని, అందువల్ల తన తాజా దరఖాస్తు విచారణకు అర్హమైనదేనని ఖలీద్ వాదించారు. ఉపా చట్టం కింద కూడా బెయిల్ అనేది ఒక నిబంధన అని మరో కేసులో మే నెలలో కోర్టు చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు. సుప్రీంకోర్టు తనకు బెయిల్ నిరాకరించి 6 నెలలు గడిచినా విచారణ ప్రక్రియలో ఎలాంటి గణనీయమైన పురోగతి లేదని, తాను దాదాపు ఆరేళ్లుగా కస్టడీలో ఉన్నానని ఇమామ్ తన దరఖాస్తులో పేర్కొన్నారు. వారి వాదనలు విన్న కర్కర్దూమా కోర్టుల అడిషనల్ సెషన్స్ జడ్జి సమీర్ బాజ్ పాయ్ ఈ పిటిషన్లు కొట్టివేశారు. గుల్ఫిషా ఫాతిమా, సయ్యద్ ఇఫ్తికార్ ఆండ్రబి కేసు తీర్పును ఇప్పటికే విస్తృత ధర్మాసనానికి సిఫార్సు చేశారని, కాబట్టి ఈ సమస్య తేలే వీరి బెయిల్ దరఖాస్తులను ఏ ప్రాతిపదికన కూడా కోర్టు పరిశీలించలేదని పేర్కొన్నారు. వారిద్దరికీ బెయిల్ నిరాకరిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించడం మినహా తనకు వేరే ప్రత్యామ్నాయం లేదని జడ్జి తెలిపారు.






