ఫీజుల బకాయిలు రూ. 8 వేల కోట్లు విడుదల చేయాలి: ఆర్ కృష్ణయ్య..

by Taduka Kalyani |

రాష్ట్రంలో గత మూడేళ్లుగా పేరుకుపోయిన రూ.8 వేల కోట్ల ఫీజు రీఇంబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని మాజీ ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు.

ఫీజుల బకాయిలు రూ. 8 వేల కోట్లు విడుదల చేయాలి: ఆర్ కృష్ణయ్య..
X

దిశ, కార్వాన్ : రాష్ట్రంలో గత మూడేళ్లుగా పేరుకుపోయిన రూ.8 వేల కోట్ల ఫీజు రీఇంబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త జీవోను రద్దు చేసి పాత విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర బీసీ విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో శనివారం మాసాబ్ ట్యాంక్ లోని హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ కార్యాలయాన్ని వందలాది మంది విద్యార్థులు ముట్టడించారు. బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ పల్లగొర్ల మోదీరాందేవ్ యాదవ్, బీసీ యువజన సంఘం అధ్యక్షుడు జిల్లపల్లి అంజి నేతృత్వంలో ఏర్పాటు చేసిన ముట్టడి కార్యక్రమానికి మద్దతుగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎంపీ ఆర్.కృష్ణయ్య ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజుల బకాయిలు చెల్లించకుండా కాలయాపన చేస్తూ లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతోందని మండిపడ్డారు. రూ.8 వేల కోట్ల బకాయిలు ఉంటే, నిన్న ప్రభుత్వం మొక్కుబడిగా కేవలం రూ.300 కోట్లు విడుదల చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. "రూ.8 వేల కోట్లకు రూ.300 కోట్లు ఏ మూలకు సరిపోతాయి? విద్యార్థుల ఉద్యమాలను అణచివేయడానికే ప్రభుత్వం ఇలాంటి కంటితుడుపు చర్యలకు పాల్పడుతోంది" అని ధ్వజమెత్తారు. ఈ సమస్య కేవలం కొందరిది కాదని, దాదాపు 14 లక్షల మంది బీసీ, ఈబీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు మరియు వారి కుటుంబాలకు సంబంధించిన అంశమని పేర్కొన్నారు. విద్యార్థుల పక్షాన నిలబడి పోరాడాలని ప్రతిపక్షాలైన బీఆర్‌ఎస్, బీజేపీ, వామపక్షాలు మరియు ప్రజాసంఘాలకు ఆయన పిలుపునిచ్చారు.

సర్టిఫికెట్లు అందక విద్యార్థుల అరిగోస

ఫీజుల బకాయిలు అందకపోవడంతో ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ వంటి కోర్సులు పూర్తయిన వేలాది మంది విద్యార్థులకు మేనేజ్‌మెంట్లు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఒరిజినల్ సర్టిఫికెట్లు చేతికి రాకపోవడంతో విద్యార్థులు ఉన్నత చదువులకు, ఉద్యోగాలకు, విదేశీ విద్యకు మరియు పోటీ పరీక్షలకు దరఖాస్తు చేసుకోలేక తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. సర్టిఫికెట్ల కోసం విద్యార్థులు కాలేజీల చుట్టూ, నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి రావడం దురదృష్టకరమన్నారు. ప్రభుత్వం నుంచి సకాలంలో నిధులు రాకపోవడంతో ప్రైవేట్ విద్యాసంస్థలు బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చి కాలేజీలను నిర్వహించాల్సి వస్తోందని విద్యార్థి నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. అధ్యాపకులు, బోధనేతర సిబ్బందికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని, ల్యాబ్‌లు, గ్రంథాలయాల నిర్వహణ దెబ్బతిని విద్య నాణ్యత పడిపోతోందని హెచ్చరించారు.

'జీవో నెంబర్ 9' ఆచరణ సాధ్యం కాదు

ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన జీవో నెంబర్ 9 ఆచరణలో సాధ్యం కాదని ఆర్.కృష్ణయ్య స్పష్టం చేశారు. ఫీజులు కట్టకుండా ఏ కాలేజీ కూడా అడ్మిషన్లు ఇవ్వదని, పేద విద్యార్థులు తమ సొంత డబ్బులు చెల్లించే పరిస్థితిలో లేరని అన్నారు. పాత విధానంలో ఏవైనా లోపాలు ఉంటే సరిచేయాలి తప్ప, విద్యార్థులపై భారం వేయకూడదని డిమాండ్ చేశారు. మొన్న జూన్ 30న జరిగిన రాష్ట్రవ్యాప్త కాలేజీల బంద్ 100 శాతం విజయవంతం కావడమే విద్యార్థుల ఆగ్రహానికి నిదర్శనమని, ప్రభుత్వం ఇప్పటికైనా పంతాలకు పోకుండా పాత విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఈ ఏడాదిని 'ఉద్యమాల సంవత్సరం'గా మారుస్తామని హెచ్చరించారు.

పాల్గొన్న నాయకులు:

ఈ ముట్టడి కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ పల్లగొర్ల మోదీరాందేవ్ యాదవ్, రాష్ట్ర బీసీ యువజన సంఘం అధ్యక్షుడు జిల్లపల్లి అంజి, నాయకులు రాజేందర్, అనంతయ్య, గుజ్జ కృష్ణ, అంజి, సిద్దు యాదవ్, వంశీ యాదవ్, బలరాం, నరేష్ గౌడ్, బాలయ్య, చిల్లర యశ్వంత్, పవన్, నికిత, యామిని తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Next Story