డిండి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

by Batti.Sumithra |

మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలో బండారు ఆగ్రోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో రూ.150 కోట్ల వ్యయంతో నిర్మించిన అత్యాధునిక రైస్ మిల్లును రాష్ట్ర పౌర సరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి శనివారం ప్రారంభించారు.

డిండి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
X

దిశ, మిర్యాలగూడ రూరల్ : మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలో బండారు ఆగ్రోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో రూ.150 కోట్ల వ్యయంతో నిర్మించిన అత్యాధునిక రైస్ మిల్లును రాష్ట్ర పౌర సరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మిర్యాలగూడలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రైస్ మిల్లును నిర్మించిన బండారు కుశలయ్యను అభినందించారు. ఈ మిల్లు ద్వారా రైతులకు, వ్యవసాయ రంగానికి మరింత మేలు జరగాలని ఆకాంక్షించారు. తాను వ్యక్తిగతంగా రైస్ మిల్లుల ప్రారంభోత్సవాలకు హాజరుకానప్పటికీ, ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, బండారు కుశలయ్య ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమానికి వచ్చినట్లు తెలిపారు.

ఈ మిల్లులో ఏర్పాటు చేసిన ఆధునిక యంత్రాలు, గోదాముల నిర్మాణ విధానం రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు. తక్కువ శ్రామిక శక్తితో అధిక సామర్థ్యంతో ధాన్యాన్ని నిల్వ చేసే విధానాలను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసే దిశగా సివిల్ సప్లైస్ శాఖ చర్యలు తీసుకుంటోందన్నారు. నిల్వల సమయంలో ధాన్యం వృథాను తగ్గించి, ఆధునిక గోదాముల నిర్మాణానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ దేశంలోనే రికార్డు సృష్టించిందన్నారు. 2023–24 రబీ సీజన్‌లో 47 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయగా, తాజా సీజన్‌లో 81 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. రైతులకు ఇప్పటి వరకు రూ.19,300 కోట్లను నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. ఈ యాసంగి సీజన్‌లో 13.36 లక్షల మంది రైతులకు సుమారు రూ.7,098.6 కోట్లను చెల్లించినట్లు వివరించారు.

ప్రస్తుత శాసనసభ కాలంలోనే ఎస్‌ఎల్‌బీసీ, డిండి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. సీఎంఆర్ పెండింగ్ బిల్లులను ఎలాంటి జాప్యం లేకుండా చెల్లించేలా చర్యలు తీసుకుంటామని, మిల్లర్లు కూడా ప్రభుత్వానికి పూర్తి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు తలెత్తే అవకాశాలు ఉన్నందున ప్రభుత్వం సూచించే పంటలనే రైతులు సాగు చేయాలని మంత్రి సూచించారు. తెలంగాణలో ఉత్పత్తి అయ్యే బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక విధానాన్ని రూపొందిస్తోందని తెలిపారు. ఎగుమతులు చేపట్టే రైస్ మిల్లులకు ప్రత్యేక ఎగుమతి ప్రోత్సాహకాలు (ఎక్స్‌పోర్ట్ ఇన్సెంటివ్స్) అందించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు.

ప్రభుత్వ విప్ వేముల వీరేశం మాట్లాడుతూ, రాష్ట్రంలో అత్యధిక స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు నిర్వహించి రైతులకు అండగా నిలిచిన ఘనత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికే దక్కుతుందని అన్నారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బీఎల్‌ఆర్) మాట్లాడుతూ, మిర్యాలగూడలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రైస్ ఇండస్ట్రీ ఏర్పాటు కావడం నియోజకవర్గానికి గర్వకారణమని అన్నారు. రైతులకు, మిల్లర్లకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొంటూ బండారు కుశలయ్యకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్, మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఉన్నం కైలాష్ నేత, మున్సిపల్ చైర్‌పర్సన్ చిలుకూరి సుధా బాలకృష్ణ, వైస్ చైర్మన్ గుడిపాటి శిరీష నవీన్, కాంగ్రెస్ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మిట్టపల్లి వెంకటేష్, ఆల్ ఇండియా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గుమ్మడి వెంకటేశ్వర్లు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కర్నాటి రమేష్, మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గౌర శ్రీనివాస్‌తో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు, రైస్ మిల్లర్ల సంఘాల ప్రతినిధులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Next Story