ఈవీ వాహనదారులకు బిగ్ అలర్ట్: ఎలక్ట్రిక్ వాహనాల మూడు యాప్‌లపై కేంద్రం నిషేధం!

by Malleboina Mahesh |   (  Updated:2026-07-03 08:31:23  IST  )

ఎలక్ట్రిక్ వాహనాలను రిమోట్‌గా నిలిపివేసేందుకు దుర్వినియోగం అవుతున్న BAT-BMS, Lossigy, Epoch-i-ion యాప్‌లను బ్లాక్ చేసిన కేంద్రం!

ఈవీ వాహనదారులకు బిగ్ అలర్ట్: ఎలక్ట్రిక్ వాహనాల  మూడు యాప్‌లపై కేంద్రం నిషేధం!
X

దిశ, వెబ్ డెస్క్: ఎలక్ట్రిక్ వాహనాల (EVs) భద్రతకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం (Central Govt) అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఎలక్ట్రిక్ బ్యాటరీతో నడిచే వాహనాలను వాటి యజమానుల ప్రమేయం లేకుండా, రిమోట్ ద్వారా (దూరం నుండి) పూర్తిగా నిలిపివేసేందుకు దుర్వినియోగం అవుతున్నాయనే ఆరోపణలపై మూడు ప్రముఖ మొబైల్ అప్లికేషన్లను తక్షణమే తొలగించాలని కేంద్రం ఆదేశించినట్లు సమాచారం. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం.. 'BAT-BMS', 'Lossigy', 'Epoch-i-ion' అనే యాప్‌లను డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల నుండి బ్లాక్ చేయాలని ఆదేశాలు జారీ అయినట్లు తెలుస్తుంది.

వాహన కొనుగోలుదారులు, ఫైనాన్స్ కంపెనీల మధ్య వివాదాలు జరిగినప్పుడు, ఇతర అక్రమ కారణాల వల్ల ఈ యాప్‌ల ద్వారా వాహనాల్లోని బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను (BMS) హ్యాక్ చేసి, ఈవీలను రిమోట్‌గా లాక్ చేస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. దీనివల్ల ప్రయాణంలో ఉన్న వాహనాలు అకస్మాత్తుగా ఆగిపోయి ప్రమాదాలు జరిగే అవకాశం ఉండటంతో సాంకేతిక పరిజ్ఞానం దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఐటీ శాఖ ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. వీటితో పాటు ఈవీ బ్యాటరీలను రిమోట్‌గా కంట్రోల్ చేస్తూ దుర్వినియోగానికి పాల్పడుతున్న మరికొన్ని ఇతర యాప్‌లను కూడా గుర్తించి, వాటిని సైతం త్వరలోనే పూర్తిగా బ్లాక్ చేస్తామని అధికారిక వర్గాలు స్పష్టం చేసినట్లు సమాచారం అందుతుండగా.. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది.

Next Story