చీము, నెత్తురు ఉంటే మంత్రి జూపల్లి రాజీనామా చేయాలి..

by Taduka Kalyani |

ఓట్ల తొలగింపు కుట్రలను తిప్పికొట్టాలని, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని, సంగారెడ్డిలో ఎస్సీ, ఎస్టీల అసైన్డ్ భూములు లాక్కుంటున్న కాంగ్రెస్ సర్కార్ కు తగిన గుణపాఠం తప్పదని మాజీ మంత్రి హరీష్ రావు హెచ్చరించారు.

చీము, నెత్తురు ఉంటే మంత్రి జూపల్లి రాజీనామా చేయాలి..
X

దిశ, సంగారెడ్డి బ్యూరో : ఓట్ల తొలగింపు కుట్రలను తిప్పికొట్టాలని, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని, సంగారెడ్డిలో ఎస్సీ, ఎస్టీల అసైన్డ్ భూములు లాక్కుంటున్న కాంగ్రెస్ సర్కార్ కు తగిన గుణపాఠం తప్పదని మాజీ మంత్రి హరీష్ రావు హెచ్చరించారు. సంగారెడ్డిలో నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం, సభ్యత్వ నమోదు అవగాహన కార్యక్రమంలో హరీశ్ రావు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను, మంత్రుల అబద్ధాలను ఎండగట్టారు. సంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు చింతా ప్రభాకర్, ఎమ్మెల్యేలు మాణిక్ రావు, సునీతా లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు క్రాంతి కిరణ్, శశిధర్ రెడ్డి, మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తో పాటు స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జూపల్లి కృష్ణారావు మళ్లీ ప్రెస్ మీట్ పెట్టిండు. నిన్న వాళ్లు గోల్ కొడుదాం అనుకుంటే సెల్ఫ్ గోల్ అయిపోయిందని హరీష్ రావు ఎద్దేవా చేశారు. అందుకే డ్యామేజ్ కంట్రోల్ మొదలు పెట్టారని, అందులో కూడా పప్పులో కాలు వేశారు. దాని సంగతి ఏందో చూద్దామన్నారు. మొన్న సవాల్ విసిరి నిన్న తోక ముడిచి నాకు వాట్సాప్ లో ఒక ఉత్తరం పెట్టిండు. పూటకో సవాలు.. రోజుకో అడ్రస్ లెక్క ఉంది జూపల్లి సంగతి అని విమర్శించారు. మొదలేమో తెలంగాణ భవన్ అన్నాడు.. తర్వాత అమరవీరుల స్థూపం అన్నాడు.. ఇప్పుడేమో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ అంటుండు. ముందు నన్ను, కేటీఆర్‌ను చర్చకు రమ్మన్నాడు.. ఇప్పుడు కేసీఆర్‌ను రావాలంటున్నారు. 2023 డిసెంబర్ నుంచి 2026 జూన్ వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్ఆర్బీఎం కింద తెచ్చిన అప్పు రూ.1,86,087 కోట్లు అయితే.. ఆయన నాకు రాసిన ఉత్తరంలో రూ.1,77,058 కోట్లు అని చెప్తుండు. మరి ఆ రూ.10 వేల కోట్లు ఎక్కడికి పోయినయి..? అని హరీష్ రావు ప్రశ్నించారు.

రాజీనామా చెయ్యి మిస్టర్ జూపల్లి

మార్చి 18, 2026 నాడు అసెంబ్లీలో నేను గట్టిగా నిలదీస్తే రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మా ప్రభుత్వం 27 నెలల్లో చేసిన అప్పు రూ. 3,47,294 కోట్లు అని అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు. ఇందులో ఏది నిజం? 4 నెలల కింద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పింది నిజమా..? మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పింది నిజమా..? అంటే ఇప్పుడు రాజీనామా ఎవరు చేయాలి? పాలమూరు బిడ్డవైతే.. పౌరుషం ఉంటే, చీము నెత్తురు ఉంటే వెంటనే రాజీనామా చెయ్యి మిస్టర్ జూపల్లి అని సవాల్ విసిరారు. నువ్వు కాదు, మీ ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి, మొత్తం మీ కేబినెట్ ను కూసోబెట్టి నిండు అసెంబ్లీలో బీఆర్ఎస్ చేసిన అప్పు 4 లక్షల కోట్లే అని నిరూపించిన, మీ అబద్ధాలను కడిగి పారేసిన. ఇప్పుడేదో వచ్చి చర్చిద్దాం అంటున్నవ్, అప్పుడు నేను సవాల్ చేస్తే అసెంబ్లీలోనే తలలు కిందవేసుకోని సప్పుడు చేయలేదు. సీనియర్ మంత్రి అంటూనే మీ క్యాబినెట్ ఎంత అప్పు చేసిందో తెల్వదా..? అని ఎద్దేవా చేశారు. కాగ్ రిపోర్టు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పు రూ. 4.15 లక్షల కోట్లు అని అసెంబ్లీలో చెప్పింది. నేనూ చెప్పింది, కాగ్ చెప్పింది ఒక్కటే. అబద్ధాలు చెబుతూ గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. జూపల్లి గారు నేను అసెంబ్లీలో మాట్లాడిన వీడియో, రేవంత్ రెడ్డి మాట్లాడిన వీడియో, ఆర్బీఐ లెక్కలు మీకు వాట్సప్ లో పంపుతున్నా చదువుకో.. చీము నెత్తురు ఉంటే రాజీనామా చేయాలని సవాల్ విసురుతున్న అన్నారు.

సింగూరు మరమ్మతు చేపట్టాలి..

బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ ఆశీర్వాదంతో మన సంగారెడ్డి జిల్లా, సదాశివపేట నియోజకవర్గానికి ప్రత్యేక అభివృద్ధి నిధుల ద్వారా నిధులు తీసుకొచ్చాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ హయాంలో మంజూరైన ఎస్డీఎఫ్ నిధులను కూడా వెనక్కి తీసుకునే పరిస్థితి వచ్చిందిన్నారు. అదే విధంగా సంగమేశ్వర–బసవేశ్వర ప్రాజెక్టు ద్వారా నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉండగా, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రాజెక్టును అటకెక్కించి సంగారెడ్డి జిల్లాకు తీవ్ర అన్యాయం చేస్తోంది. రేపు ఏడు మండలాల ప్రజలు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంది. సంగమేశ్వర ప్రాజెక్టు గురించి, బసవేశ్వర ప్రాజెక్టు గురించి జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక్కరోజైనా మాట్లాడారా..? అని హరీష్ రావు ప్రశ్నించారు. జిల్లాకు చెందిన మంత్రి ఈ అంశంపై ఎందుకు మాట్లాడటం లేదు..? మీ నియోజకవర్గాల్లో ఉన్న ప్రాజెక్టులకు నిధులు ఇస్తే, మా సంగారెడ్డి జిల్లాకు, మా రైతులకు ఉపయోగపడే సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టులకు ఎందుకు నిధులు ఇవ్వడం లేదు. తక్షణమే ఈ ప్రాజెక్టులకు నిధులు కేటాయించి పనులు ప్రారంభించాలి. లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లాలో పెద్ద ఎత్తున ఉద్యమాలు, పాదయాత్రలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు.

బీఆర్ఎస్ రోడ్డెక్కితే తప్ప ప్రభుత్వం స్పందించడం లేదు

బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రైతులు ఇబ్బందులు పడుతున్నారని సమాచారం వచ్చిన వెంటనే కేసీఆర్ గారితో మాట్లాడి రెండు రోజుల్లోనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేవాళ్లం. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ రోడ్డెక్కితే తప్ప ప్రభుత్వం స్పందించడం లేదు. ఇప్పటికే రైతులకు రావాల్సిన సుమారు రెండు కోట్ల రూపాయలు పెండింగ్‌లో ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాకు రావాల్సిన ఆ నిధులు ఇప్పటికీ ఎందుకు విడుదల చేయలేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. సింగూరు ప్రాజెక్టుకు మరమ్మతు చేస్తాం అని చెప్పి ఇప్పటికీ చర్యలు తీసుకోలేదు. సింగూరు ప్రాజెక్టు సంగారెడ్డి జిల్లాకే కాదు, హైదరాబాద్‌కు తాగునీరు అందించే కీలకమైన ప్రాజెక్టు. ఇప్పటికైనా తక్షణమే మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఎస్సీ, ఎస్టీ, బీసీల అసైన్డ్ భూములకు పట్టాలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్.. ఇప్పుడు ఉన్న భూములనే లాక్కుంటోంది. ఒక్క సంగారెడ్డిలోనే 700 ఎకరాలు, రాష్ట్రవ్యాప్తంగా 50 వేల ఎకరాల అసైన్డ్ భూములను లాక్కునే కుట్ర జరుగుతోంది. ఎకరం రూ. 3 కోట్లు ఉంటే రూ. 40 లక్షలు ఇస్తామని గిరిజనులను మోసం చేస్తున్నారు. మహిళలకు నెలకు రూ.2500, వృద్ధులకు రూ.4000 పెన్షన్, ఫీజు రీయింబర్స్ మెంట్, పీఆర్సీ.. ఇలా ఏ ఒక్క హామీని రేవంత్ ప్రభుత్వం నెరవేర్చలేదు. మూసీ సుందరీకరణ పేరుతో హడావుడి చేస్తున్న ప్రభుత్వం మల్లన్నసాగర్ గురించి ఎందుకు మాట్లాడటం లేదు? ఆ మల్లన్నసాగర్ నుంచి హైదరాబాద్‌కు తాగునీరు, మూసీకి నీళ్లు వెళ్తున్నాయంటే అది కేసీఆర్ గారు, బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కృషే అని గుర్తు చేశారు. మల్లన్నసాగర్ రేవంత్ రెడ్డి అయ్య కట్టాడా? ఈరోజు హైదరాబాద్‌కు అది పెద్ద దిక్కుగా మారిందంటే అది కేసీఆర్ చలువే అన్నారు.

Next Story