- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాజు గోండుల కోటను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం
రాజు గోండుల కోటను దేశంలోనే ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు.

దిశ, ఉట్నూర్ : రాజు గోండుల కోటను దేశంలోనే ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఉట్నూర్ మండల కేంద్రంలోని చారిత్రక రాజు గోండుల కోటను శుక్రవారం జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఐటీడీఏ పీవో మంద మకరందు తో కలిసి సందర్శించి కోట పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. గోండు రాజుల చరిత్రకు, గిరిజన సంస్కృతికి ప్రతీకగా నిలిచిన రాజు గోండుల కోటను త్వరితగతిన పునర్నిర్మించి, ఆధునిక సౌకర్యాలతో దేశవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షించే ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. కోట పునర్నిర్మాణంలో చారిత్రకతకు భంగం కలగకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. కోటలో గోండు రాజుల వంశ చరిత్ర, వారి పాలన, సంస్కృతి, సంప్రదాయాలు, వారసత్వ ఆనవాళ్లు, పురాతన వస్తువులు, చారిత్రక ఆధారాలను ప్రతిబింబించేలా అత్యాధునిక మ్యూజియాన్ని ఏర్పాటు చేయాలని తెలిపారు. భావితరాలకు గిరిజనుల గొప్ప చరిత్రను తెలియజేసే విధంగా మ్యూజియాన్ని రూపొందించాలని పేర్కొన్నారు.
స్థానిక గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు
అదే విధంగా కోట ప్రాంగణంలో గిరిజన సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ప్రత్యేక వేదిక, గిరిజన హస్తకళలు, సంప్రదాయ ఉత్పత్తుల విక్రయానికి మార్కెటింగ్ స్టాల్స్, చిన్నారుల కోసం ప్రత్యేక పార్కు, క్రీడా ప్రాంగణం, సందర్శకుల కోసం రూఫింగ్ షెడ్లు, విశ్రాంతి భవనాలు, తాగునీరు, పారిశుద్ధ్య సదుపాయాలు, ఆకర్షణీయమైన ఉద్యానవనాలు, విద్యుద్దీపాల అలంకరణ, పచ్చదనం పెంపు వంటి అన్ని మౌలిక సదుపాయాలను కల్పించాలని అధికారులను ఆదేశించారు. పర్యాటకులు కోట చరిత్రను సులభంగా తెలుసుకునే విధంగా సమాచార ఫలకాలు, దిశానిర్దేశక బోర్డులు, డిజిటల్ సమాచార వ్యవస్థలను ఏర్పాటు చేయాలని సూచించారు. కోట అభివృద్ధి ద్వారా స్థానిక గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు ఉట్నూర్ ప్రాంతం పర్యాటక రంగంలో ప్రత్యేక గుర్తింపు పొందుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. రాజు గోండుల కోటను సుందరీకరించి తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందే పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి త్వరితగతిన కార్యాచరణ చేపట్టాలని సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్కియాలజీ డైరెక్టర్ కొతాడి ప్రొఫెసర్ అర్జున్ రావు, అడిషనల్ డైరెక్టర్ నరసింహులు, డిడి సాగర్, ఓఎస్డి రాజు, రవికుమార్, టూరిజం శాఖ అధికారి , ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ తానాజీ, ఏపీఓపిబిటిజి ఆత్రం భాస్కర్, డిప్యూటీ డిఇఓ చందన్, జేమ్స్ కోట ఇంజనీర్, ఆర్ అండ్ బి అధికారులు, తదితరులు పాల్గొన్నారు.






