ప్రముఖ విప్లవ గాయకుడు అరుణోదయ నాగన్న కన్నుమూత

by Muthe.Rajitha |

ప్రముఖ విప్లవ గీతాల గాయకుడు, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య నాయకుడు అరుణోదయ నాగన్న కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు.

ప్రముఖ విప్లవ గాయకుడు అరుణోదయ నాగన్న కన్నుమూత
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రముఖ విప్లవ గీతాల గాయకుడు, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అగ్రనేత అరుణోదయ నాగన్న కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, ఖమ్మంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో శుక్రవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. నాగన్న మృతితో విప్లవ, సాంస్కృతిక రంగాలు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాయి. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగన్న గత ఏడాది బ్రెయిన్ స్ట్రోక్ బారిన పడి చికిత్స తీసుకున్నారు. అప్పటి నుంచి కోలుకుంటున్నప్పటికీ, ఇటీవల మరోసారి ఆయన ఆరోగ్యం క్షీణించింది. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ను ఖమ్మంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఐసీయూలో అత్యవసర చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోవడంతో నాగన్న మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.

పాటలతో సాగిన ఐదు దశాబ్దాల పోరాటం

ఖమ్మం జిల్లా రాజారాం గ్రామానికి చెందిన నాగన్న.. పేరుకు ముందు ఇంటి పేరు, వెనుక ఊరి పేరు లేకుండా కేవలం 'అరుణోదయ నాగన్న'గానే ప్రజా హృదయాల్లో నిలిచిపోయారు. దాదాపు అర్ధ శతాబ్ద కాలంగా పీడిత ప్రజల పక్షాన నిలిచి తన ఆటపాటలతో విప్లవ భావజాలాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. సారా వ్యతిరేక ఉద్యమం, భూపోరాటాలు, గిరిజన హక్కుల ఉద్యమాల వంటి ఎన్నో ప్రజా పోరాటాలకు నాగన్న గొంతుక ఊపిరి పోసింది. సామాజిక మార్పు కోసం నిరంతరం శ్రమించిన ఆయనకు ఇటీవల 'సుద్దాల హనుమంతు జాతీయ పురస్కారం' కూడా లభించింది. నాగన్న భౌతికకాయాన్ని తుది సందర్శనార్థం ఆయన స్వగ్రామానికి తరలించనున్నారు. అరుణోదయ నాగన్న మృతి పట్ల పలువురు రాజకీయ నేతలు, ప్రజాసంఘాల నాయకులు, విప్లవ కవులు, కళాకారులు తీవ్ర సంతాపాన్ని ప్రకటిస్తూ, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.

Next Story