ఓటర్ల నుంచి సేకరించిన వివరాలను బీఎల్ఓ యాప్‌లో నమోదు చేయాలి

by Taduka Kalyani |

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా ఓటర్ల నుంచి ఎన్యుమరేషన్ ఫారాల ద్వారా సేకరించిన వివరాలను బీఎల్ఓ యాప్‌లో స్పష్టంగా, ఖచ్చితంగా నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు.

ఓటర్ల నుంచి సేకరించిన వివరాలను బీఎల్ఓ యాప్‌లో నమోదు చేయాలి
X

దిశ, చైతన్యపురి : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా ఓటర్ల నుంచి ఎన్యుమరేషన్ ఫారాల ద్వారా సేకరించిన వివరాలను బీఎల్ఓ యాప్‌లో స్పష్టంగా, ఖచ్చితంగా నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఎంఎంసి ఎల్బీనగర్ జోన్ పరిధిలోని పలు వార్డుల్లో కొనసాగుతున్న ఇంటింటి ఎన్యుమరేషన్ కార్యక్రమాన్ని జిల్లా జోనల్ కమిషనర్ వికాస్ మహతో తో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భారత ఎన్నికల సంఘం నిర్దేశించిన ఎన్నికల షెడ్యూల్ ప్రకారం జిల్లాలో జూన్ 25 నుంచి జూలై 24 వరకు ఇంటింటి ఎన్యుమరేషన్ కార్యక్రమం కొనసాగుతోందని తెలిపారు. ప్రతి ఇంటిని సందర్శించి అర్హులైన ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాలను అందజేయడంతోపాటు ఆ వివరాలను వెంటనే బీఎల్ఓ యాప్‌లో నమోదు చేయాలని సూచించారు. అనంతరం ఓటర్లు పూర్తి చేసిన ఫారాలను సేకరించి, అందులో పొందుపరిచిన వివరాలను యాప్‌లో ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా నమోదు చేయాలని ఆదేశించారు. ఓటరు జాబితాలో ఎలాంటి పొరపాట్లు, నకిలీ నమోదులు లేదా అనర్హుల పేర్లు లేకుండా అత్యంత పారదర్శకంగా విశ్వసనీయంగా ఓటరు జాబితాను రూపొందించేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. బూత్ స్థాయి అధికారులు నిర్వహిస్తున్న సర్వే విధానం, ఫారాల పంపిణీ, యాప్‌లో నమోదు ప్రక్రియ, పూర్తి చేసిన ఫారాల సేకరణ తదితర అంశాలను పరిశీలించి అధికారులకు అవసరమైన సూచనలు చేశారు. ఎన్నికల ప్రక్రియలో ఓటరు జాబితా అత్యంత కీలకమైన ఆధార పత్రంగా ఉంటుందని పేర్కొన్న కలెక్టర్, ప్రతి నమోదు నిబంధనలకు అనుగుణంగా ఉండేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.

ప్రతి అర్హుడికి ఒకే ఓటరు గుర్తింపు కార్డు

మరణించిన ఓటర్ల పేర్లను సంబంధిత ఆధారాలతో తొలగించడం, ఒకే వ్యక్తికి రెండు లేదా అంతకంటే ఎక్కువ ఈపీఐసీ కార్డులు ఉన్నట్లయితే వాటిని గుర్తించి అవసరమైన చర్యలు తీసుకోవడం, నివాసం మారిన వారి వివరాలను సక్రమంగా నవీకరించడం వంటి అంశాలను అత్యంత బాధ్యతతో నిర్వహించాలన్నారు. ప్రతి అర్హుడికి ఒకే ఓటరు గుర్తింపు కార్డు ఉండేలా చర్యలు చేపట్టి ఖచ్చితమైన తప్పులులేని పారదర్శకమైన ఓటరు జాబితా రూపొందించడమే ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ లక్ష్య సాధనలో బీఎల్ఓలు కీలక పాత్ర పోషిస్తున్నందున వారు ప్రతి ఇంటిని సందర్శించి ప్రజలకు కార్యక్రమంపై అవగాహన కల్పించాలని సూచించారు. ఎన్యుమరేషన్ ఫారాలను నింపే సమయంలో ఓటర్లు సరైన వివరాలను అందించాలని, అవసరమైన పత్రాలను జతచేయాలన్నారు. అధికారులు కోరిన సమాచారాన్ని పూర్తిగా అందించడం ద్వారా ఖచ్చితమైన ఓటరు జాబితా తయారీలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని అయన విజ్ఞప్తి చేశారు. బీఎల్ఓ యాప్‌లో నమోదయ్యే ప్రతి వివరాన్ని ఒకటికి రెండుసార్లు పరిశీలించి నమోదు చేయాలన్నారు. సాంకేతికపరమైన పొరపాట్లు, డేటా ఎంట్రీలో తప్పిదాలు, వివరాల లోపాలు చోటు చేసుకోకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలను ప్రతి అధికారి, బీఎల్ఓ కచ్చితంగా పాటిస్తూ నిర్ణీత గడువులోపు ఎన్యుమరేషన్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయాలని సూచించారు. ఈకార్యక్రమంలో సంబంధిత ఎన్నికల అధికారులు, మున్సిపల్ అధికారులు, బూత్ స్థాయి అధికారులు పాల్గొన్నారు.

Next Story