ప్రజలకు మరింత చేరువగా పోలీసులు : ఎమ్మెల్యే

by Taduka Kalyani |   (  Updated:2026-07-03 14:36:57  IST  )

ప్రజల రక్షణ, భద్రత, సమస్యల పరిష్కారం కోసం కల్హేర్ మండల కేంద్రంలో నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించినట్లు జిల్లా ఎస్పీ పారితోష్ పంకజ్ తెలిపారు.

ప్రజలకు మరింత చేరువగా పోలీసులు : ఎమ్మెల్యే
X

దిశ, నారాయణఖేడ్: ప్రజల రక్షణ, భద్రత, సమస్యల పరిష్కారం కోసం కల్హేర్ మండల కేంద్రంలో నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించినట్లు జిల్లా ఎస్పీ పారితోష్ పంకజ్ తెలిపారు. శుక్రవారం నూతన భవనాన్ని నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ల డాక్టర్ సంజీవరెడ్డి, పోలీసు అధికారులతో కలిసి ప్రారంభించి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజలకు మరింత చేరువలో సేవలు అందించేందుకు ఆధునిక సౌకర్యాలతో పోలీస్ స్టేషన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ప్రజల భద్రతను మరింత బలోపేతం చేస్తామని పేర్కొన్నారు.

రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని ఎస్పీ అన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కారులో ప్రయాణించే వారు సీట్‌బెల్ట్ పెట్టుకోవాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని, డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వినియోగించరాదని హెచ్చరించారు. ఆటో డ్రైవర్లు యూనిఫాం ధరించడంతో పాటు పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించరాదని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి మాట్లాడుతూ.. గతంలో శిథిలావస్థకు చేరిన పాత భవనంలో పోలీస్ స్టేషన్ కొనసాగడం వల్ల సిబ్బంది, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. ప్రస్తుతం నూతన భవనం ప్రారంభం కావడం వల్ల పోలీసు సేవలు మరింత సమర్థవంతంగా అందుతాయని తెలిపారు. అలాగే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రభుత్వ భవనాల నిర్వహణను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఎమ్మెల్యే విమర్శించారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ వెంకటరెడ్డి, సీఐలు వెంకటరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ఎస్సైలు శ్రీశైలం, కోటేశ్వరరావు, రవి గౌడ్, రామకృష్ణ, మహేష్, దుర్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Next Story