‘చిల్లర రాజకీయాలు మానేసి.. కేంద్రీయ విద్యాలయానికి 10 ఎకరాలు కేటాయించండి’:ఎంపీ

by Kodari Anjali |

జగిత్యాలకు మంజూరైన కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 10 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ డిమాండ్ చేశారు.

‘చిల్లర రాజకీయాలు మానేసి.. కేంద్రీయ విద్యాలయానికి 10 ఎకరాలు కేటాయించండి’:ఎంపీ
X

దిశ, జగిత్యాల ప్రతినిధి: జగిత్యాలకు మంజూరైన కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 10 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ డిమాండ్ చేశారు. శుక్రవారం జగిత్యాలలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, ఈ అంశంలో రాష్ట్ర ప్రభుత్వం చిల్లర రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు. కేంద్రీయ విద్యాలయం కోసం 10 ఎకరాల స్థలం కేటాయించాలని తాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశానని, అయితే ప్రభుత్వం కేవలం 5 ఎకరాలనే కేటాయించిందని అన్నారు. సీఎం తమాషాలు చేస్తున్నారని, విద్యార్థుల భవిష్యత్తుతో రాజకీయం చేయడం సరికాదని మండిపడ్డారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై కూడా ఎంపీ అరవింద్ తీవ్ర విమర్శలు చేశారు.

జగిత్యాలలో మాత్రం ఇవ్వకుండా అడ్డంకులు..

"కాస్ట్లీ ల్యాండ్" అంటూ స్థలం ఇవ్వకుండా ఎమ్మెల్యే అడ్డుపడుతున్నారని, ఆ భూమి ఎమ్మెల్యే వ్యక్తిగత ఆస్తి కాదని వ్యాఖ్యానించారు. చల్‌గల్ ప్రాంతంలో 10 ఎకరాలు కేటాయిస్తే విద్యార్థులకు అన్ని వసతులతో కూడిన కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేసే అవకాశం ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో కేంద్రీయ విద్యాలయాలకు అవసరమైన 10 ఎకరాల స్థలం కేటాయించగా, జగిత్యాలలో మాత్రం ఇవ్వకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని ఇప్పటికే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో పాటు సీఎం రేవంత్ రెడ్డికి కూడా లేఖ రాశానని తెలిపారు. కేంద్రీయ విద్యాలయానికి పూర్తి స్థాయిలో 10 ఎకరాల స్థలం కేటాయించకపోతే, భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మరోసారి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని ఎంపీ ధర్మపురి అరవింద్ హెచ్చరించారు. ఈ మీడియా సమావేశంలో పార్టీ జిల్లా యాదగిరి బాబు,, నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ బోగ శ్రావణి ఇతర నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Next Story