- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఒడిశా నుంచి ఖమ్మం నగరానికి గంజాయి
రాష్ట్రంలో మాదకద్రవ్యాల నెట్‌వర్క్‌ను ఛేదించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎలైట్ వింగ్ ఈగల్ ఫోర్స్ ఖమ్మం జిల్లాలో భారీ ఆపరేషన్ నిర్వహించింది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో మాదకద్రవ్యాల నెట్‌వర్క్‌ను ఛేదించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎలైట్ వింగ్ ఈగల్ ఫోర్స్ ఖమ్మం జిల్లాలో భారీ ఆపరేషన్ నిర్వహించింది. ఖమ్మం పోలీసులతో కలిసి సత్తుపల్లి సమీపంలో నిర్వహించిన మెరుపు దాడిలో రూ. 90 లక్షల విలువైన 180 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్న ఈ భారీ సరుకును అధికారులు రేజర్ల వద్ద పట్టుకున్నారు. ఈగల్ ఫోర్స్ తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రం మల్కన్‌గిరికి చెందిన ప్రబిన్ భాత్రా (31) అనే వ్యక్తి కూలీ పనులు చేసుకుంటూనే గంజాయి స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నాడు. చిత్రకొండకు చెందిన భికారీ @ రోహన్ అనే ట్రాన్స్‌పోర్టర్.. ఈ గంజాయిని హైదరాబాద్‌కు చేరిస్తే రూ. 10 వేలు ఇస్తానని ప్రబిన్‌కు ఆశ చూపాడు.
దీనికోసం ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లాకు చెందిన నాగేశ్వర్ అనే వ్యక్తికి చెందిన టయోటా ఈటియోస్ కారును వీరు వినియోగించారు. కారులో గంజాయిని లోడ్ చేసి, హైదరాబాద్ చేరుకున్నాక ఫోన్ చేస్తే ఎవరికి అప్పగించాలో చెబుతానని రోహన్ నిందితుడికి సూచించాడు. అయితే, ఈ అక్రమ రవాణాపై సమాచారం అందుకున్న ఈగల్ ఫోర్స్ స్థానిక పోలీసులు.. సత్తుపల్లి మండలంలోని రేజర్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం వద్ద నిఘా పెట్టారు. అనుమానాస్పదంగా వచ్చిన కారును ఆపి సోదాలు చేయగా.. 180 కిలోల గంజాయి బయటపడింది. దీంతో ప్రబిన్ భాత్రాను పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా అరెస్ట్ చేశారు.
వైజాగ్ జైల్లో శిక్ష అనుభవించి వచ్చినా..
అరెస్ట్ అయిన ప్రబిన్ భాత్రా గతంలోనూ గంజాయి స్మగ్లింగ్‌లో ఆరితేరినట్లు అధికారులు గుర్తించారు. గతంలో ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లా మాకవరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి కేసులో అరెస్టై, విశాఖపట్నం జైల్లో పది నెలల పాటు శిక్ష అనుభవించాడు. జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా మళ్లీ అదే మత్తు దందాలోకి దిగి పట్టుబడటం గమనార్హం. ప్రస్తుతం ఈ కేసులో ప్రధాన నిందితుడు రోహన్, కారు యజమాని నాగేశ్వర్ పరారీలో ఉన్నారు.
తల్లిదండ్రులకు విజ్ఞప్తి..
మత్తు పదార్థాల వల్ల యువత, విద్యార్థుల జీవితాలు చిన్నాభిన్నం అవుతున్నాయని ఈగల్ ఫోర్స్ ఆవేదన వ్యక్తం చేసింది. యువత డ్రగ్స్ బారిన పడకుండా తల్లిదండ్రులు తమ పిల్లల కార్యకలాపాలపై ఒక కన్నేసి ఉంచాలని సూచించింది. మత్తు పదార్థాల సమాచారం తెలిస్తే నిర్భయంగా పోలీసులకు తెలపాలని, డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈగల్ ఫోర్స్ విజ్ఞప్తి చేసింది.






