కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేయండి : సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ లేఖ

by Naga Rani Yarlagadda |

రాష్ట్రంలో వెంటనే 20వేల కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు.

కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేయండి : సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ లేఖ
X
  • 20వేల జాబ్స్‌కి నోటిఫికేషన్ జారీ చేయాలి

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో వెంటనే 20వేల కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు. ఈ మేరకు శుక్రవారం ఆయన సీఎం రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై పరీక్షలకు పోటీపడే యువతలో ఎక్కువ శాతం గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందినవాళ్లే ఉంటారని తెలిపారు. తల్లిందండ్రులకు దూరంగా ఉంటూ, హైదరాబాద్‌కు వచ్చి ఏళ్ల తరబడి పీజీల్లో, హాస్టళ్లలో ఉంటూ రేయింబవళ్లు కష్టపడి వాళ్లు పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతారని పేర్కొన్నారు. అలాంటి పేద యువత ఆశల మీద నీళ్లు చల్లకుండా వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్నదని గుర్తుచేశారు. నీళ్లు, నిధులు, నియామకాలు అనేదే తెలంగాణ ఉద్యమ నినాదమని.. అలాంటిది నియామకాల విషయంలో కొన్ని రోజులుగా పోస్టులు పెంచాలని పోరాడుతున్న పోలీస్ నిరుద్యోగ అభ్యర్ధుల డిమాండ్లను పెడచెవిన పెట్టడం ఏ మాత్రం సమంజసం కాదని సూచించారు. కేవలం 5 వేల పోలీస్ ఉద్యోగాలకే ప్రకటన ఇచ్చి చేతులు దులుపుకోవడం సరైంది కాదని తెలిపారు. రాష్ట్రంలో సుమారు 17 వేల పోలీసు పోస్టులు ఖాళీ ఉన్నాయని ఆర్టీఐ ద్వారా బహిర్గతమైందని.. స్వయంగా మీరే 12 వేల పోస్టులు ఖాళీ ఉన్నాయని.. వాటిని భర్తీ చేస్తామని పలుమార్లు హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ఇలాంటి నేపథ్యంలో.. కేవలం 5 వేల పోస్టులు భర్తీ చేస్తామనడం సుమారు 15 లక్షల మంది పోలీస్ ఉద్యోగార్థులను నైరాశ్యంలోకి నెట్టేసిందని.. దిల్‌సుఖ్‌నగర్ లాంటి ప్రాంతాల్లో ప్రతీరోజు నిరుద్యోగులు రోడ్డెక్కే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో మూడు పర్యాయాల్లో కలిపి సుమారు 47 వేల పోలీస్ ఉద్యోగాలను భర్తీ చేశామని వెల్లడించారు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు యూత్ డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ పార్టీ ఎన్నో హామీలు ఇచ్చిందని.. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని యువతను నమ్మబలికిందని తెలిపారు. ప్రతీ ఏడాది జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని మాట తప్పిందని గుర్తుచేశారు. ప్రస్తుత జీవో 87 ప్రకారం ఎస్సై అభ్యర్థులకు 35 ఏళ్లు, కానిస్టేబుల్ అభ్యర్థులకు 32 ఏళ్ల గరిష్ట వయోపరిమితి ఉన్నదని.. పోలీస్ నోటిఫికేషన్లు వెలువడి దాదాపు నాలుగేళ్లు గడుస్తున్నందున, వయోపరిమితిని సడలించడం అత్యంత కీలకమని పేర్కొన్నారు.

సర్ కార్యక్రమాల పర్యవేక్షణకు ప్రత్యేక కమిటీ

రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ప్రత్యేక ఎన్నికల జాబితా సవరణ కార్యక్రమంలో పార్టీ తరఫున బీఎల్ఏలను సమన్వయం చేయడానికి కేటీఆర్ ప్రత్యేక సమన్వయ, పర్యవేక్షణ కమిటీని ప్రకటించారు. బీఎల్ఏల భాగస్వామ్యాన్ని సమన్వయం చేయడం, వారికి వచ్చే సందేహాలను సమస్యలను కేంద్ర పార్టీ కార్యాలయం మధ్య సమన్వయం కల్పించడం, ఆయా అంశాలను స్థానిక ఇన్చార్జిలకు తెలియజేసి సాఫీగా పార్టీ తరఫున ఈ కార్యక్రమం కొనసాగించేలా చూడడం ఈ కమిటీ ప్రధాన బాధ్యతగా ఉంటుందని తెలిపారు. ఈ కమిటీలో ఎమ్మెల్సీలు ఎల్.రమణ, డాక్టర్ శ్రవణ్ దాసోజు, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, పార్టీ జనరల్ సెక్రెటరీ భరత్‌కుమార్ సోమా, మాజీ చైర్మన్లు మన్నె క్రిషాంక్, సతీష్‌రెడ్డి, పార్టీ నేతలు ముజీబుద్దీన్, సుమిత్ర ఆనంద్, అభిలాష్ రావు రంగినేని సభ్యులుగా ఉంటారు.

11 ఏళ్ల కార్టూనిస్టుకు అభినందన

11 ఏళ్ల బాల కార్టూనిస్టు శ్రీయాన్ శ్రీరంగం కార్టూన్లకు కేటీఆర్ అభినందనలు తెలిపారు. ఏడేళ్ల వయసులోనే కార్టూన్లు గీయడం ప్రారంభించిన శ్రీయాన్, తన ఉత్తమ కార్టూన్లతో ‘బ్రోచేవారెవరు బ్రో.. నను’ పేరుతో పుస్తకాన్ని ప్రచురించడం విశేషమని పేర్కొన్నారు. మరింత ఉన్నత శిఖరాలకు చేరాలని, భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

Next Story