ఐదో రోజుకు చేరిన సింగరేణి అధికారుల నిరాహార దీక్ష..

by Kodari Anjali |

బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ సంస్థ వ్యాప్తంగా సింగరేణి అధికారుల చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష శుక్రవారం ఐదో రోజుకు చేరింది.

ఐదో రోజుకు చేరిన సింగరేణి అధికారుల నిరాహార దీక్ష..
X

దిశ, యైటింక్లయిన్ కాలనీ: సింగరేణి అధికారుల పే అప్‌గ్రేడేషన్‌ను తక్షణమే అమలు చేయడంతో పాటు, పెండింగ్‌లో ఉన్న పీఆర్పీ (PRP) బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ సంస్థ వ్యాప్తంగా సింగరేణి అధికారుల చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష శుక్రవారం ఐదో రోజుకు చేరింది. సంస్థలో విధులు నిర్వహిస్తున్న అధికారులకు న్యాయబద్ధంగా రావాల్సిన వేతన సవరణ, పీఆర్పీ బకాయిల విషయంలో యాజమాన్యం నిర్లక్ష్య ధోరణి అవలంబించడం తీవ్ర నిరాశకు గురిచేస్తోందని దీక్షలో పాల్గొన్న అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...ఉద్యోగుల సంక్షేమం, సంస్థ అభివృద్ధి కోసం అధికారులు అంకితభావంతో పనిచేస్తున్నప్పటికీ, వారి న్యాయమైన డిమాండ్లను యాజమాన్యం పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు.

యాజమాన్యం ఇప్పటికైనా స్పందించి...

పే అప్‌గ్రేడేషన్ అమలులో జరుగుతున్న జాప్యం వల్ల అధికారులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అలాగే, చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పీఆర్పీ బకాయిలను వెంటనే విడుదల చేసి అధికారులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పలుమార్లు విన్నవించినప్పటికి యాజమాన్యం నుంచి ఎలాంటి స్పష్టమైన హామీ లేకపోవడం వల్లే నిరసనగా నిరాహార దీక్షలు చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. యాజమాన్యం ఇప్పటికైనా స్పందించి అధికారుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో ఆందోళనను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కాగా నిరాహార దీక్షకు కూర్చున్న మహిళా అధికారులకు ఏరియాలో వివిధ విభాగాల అధికారుల సతీమణులు సంఘీభావం తెలిపారు. ఎన్. శిరీష డెప్యూటీ ఎఫ్.ఎమ్ (ఎఫ్ & ఏ), ఎన్. రక్షిత సీనియర్ అండర్ మేనేజర్, బి. జీవన్మయి సీనియర్ అండర్ మేనేజర్, బి. సోనియా ఈ.ఈ (సివిల్), టి. హిమ వర్ష ఏ.ఓ (ఎఫ్ & ఏ)లు పాల్గొన్నారు.

Next Story