ఎస్‌ఐఆర్ ఫామ్ ఇలా నింపండి.. తప్పులు లేకుండా చూసుకోండి

by Ratna Kumari |

ప్రతి అర్హత‌ ఉన్న పౌరుడికి ఓటు హక్కు కల్పించడం, ఓటరు జాబితాను తప్పులు లేకుండా రూపొందించడం ఎన్నికల సంఘం ప్రధాన లక్ష్యం.

ఎస్‌ఐఆర్ ఫామ్ ఇలా నింపండి.. తప్పులు లేకుండా చూసుకోండి
X

దిశ, ఎల్లారెడ్డి : ప్రతి అర్హత‌ ఉన్న పౌరుడికి ఓటు హక్కు కల్పించడం, ఓటరు జాబితాను తప్పులు లేకుండా రూపొందించడం ఎన్నికల సంఘం ప్రధాన లక్ష్యం. ఈ నేపథ్యంలో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ కొనసాగుతోంది. బూత్ లెవల్ అధికారులు (బీఎల్‌వోలు) ఇంటింటికీ వెళ్లి తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో ముద్రించిన ఎన్యూమరేషన్ ఫారాలను అందజేస్తున్నారు. అయితే ఫామ్‌ను ఎలా నింపాలనే విషయంలో పలువురు సందిగ్ధత వ్యక్తం చేస్తున్నారు.

ఫామ్‌ను స్పష్టంగా నింపాలి..

ఎన్యూమరేషన్ ఫామ్ ఓటరు జాబితా ధ్రువీకరణకు ఎన్నికల సంఘం ఉపయోగించే కీలక పత్రం. అందులోని వివరాలను స్పష్టమైన అక్షరాలతో, ఎలాంటి తప్పులు లేకుండా నమోదు చేయాలి. ఫామ్ పైభాగంలో ఇప్పటికే ముద్రించిన పేరు, ఎపిక్ నంబర్, చిరునామా, నియోజకవర్గం వివరాలను పరిశీలించి, నిర్దేశించిన చోట తాజా రంగు ఫొటో అతికించాలి.

మధ్య భాగంలో 2002 నాటి ఓటరు జాబితా ఆధారంగా అప్పట్లో ఓటు ఉంటే సంబంధిత బాక్స్‌లో వివరాలు నమోదు చేయాలి. ఓటు లేకపోతే తల్లిదండ్రులు, తాత, నాయనమ్మ లేదా కుటుంబ సభ్యుల వివరాలను పేర్కొనాలి. చివరి భాగంలో ప్రస్తుత వ్యక్తిగత వివరాలు, పుట్టిన తేదీ, ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, తల్లిదండ్రులు లేదా జీవిత భాగస్వామి వివరాలను నమోదు చేయాలి.

ఈ పత్రాలు సిద్ధంగా ఉంచుకోండి..

ఫామ్‌తో పాటు కింది పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఆధార్ కార్డు, జనన ధ్రువీకరణ పత్రం, పదో తరగతి మార్కుల మెమో, కుల ధ్రువీకరణ పత్రం (అవసరమైతే), విద్యుత్ బిల్లు లేదా అద్దె రసీదు వంటి చిరునామా ధ్రువీకరణ పత్రాలు, పేరు స్పెల్లింగ్, పుట్టిన తేదీ వంటి వివరాలు అన్ని పత్రాల్లో ఒకే విధంగా ఉండేలా జాగ్రత్త పడాలి.

రసీదు తప్పనిసరిగా తీసుకోండి..

ఫామ్‌ను బీఎల్‌వోకు సమర్పించిన అనంతరం రసీదు లేదా అంగీకార పత్రాన్ని తప్పనిసరిగా తీసుకోవాలి. ఏవైనా సందేహాలు ఉంటే వెంటనే సంబంధిత బీఎల్‌వోను సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు.

గుర్తుంచుకోవాల్సిన అంశాలు..

తప్పుడు సమాచారం ఇవ్వకూడదు, ఫామ్‌లో ఖాళీలు వదిలేయకూడదు, ఇతరుల పత్రాలను ఉపయోగించకూడదు, చివరలో సంతకం లేదా వేలిముద్ర తప్పనిసరిగా వేయాలి, ఇంటి నంబర్, పోస్టాఫీస్, పూర్తి చిరునామా వివరాలను స్పష్టంగా నమోదు చేయాలి, సరైన వివరాలతో ఎన్యూమరేషన్ ఫామ్‌ను సమర్పిస్తే ఓటరు జాబితాలో పేరు సక్రమంగా నమోదై, భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు.

Next Story