రోషం, పౌరుషం ఉంటే రాజీనామాకు సిద్ధమని చెప్పండి : హరీష్, కేటీఆర్‌లకు జూపల్లి సవాల్

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-07-03 12:09:04  IST  )

అప్పులపై చర్చించేందుకు మాజీ మంత్రులు, బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావులు ప్రెస్ క్లబ్ కు రావాలని, లేదంటే బీఆర్ఎస్ పార్టీ సిగ్గు తప్పిన పార్టీగా మిగిలిపోతుందని మంత్రి జూపల్లి కృష్ణారావు హాట్ కామెంట్స్ చేశారు.

రోషం, పౌరుషం ఉంటే రాజీనామాకు సిద్ధమని చెప్పండి : హరీష్, కేటీఆర్‌లకు జూపల్లి సవాల్
X

దిశ, వెబ్‌డెస్క్: అప్పులపై చర్చించేందుకు మాజీ మంత్రులు, బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావులు ప్రెస్ క్లబ్ కు రావాలని, లేదంటే బీఆర్ఎస్ పార్టీ సిగ్గు తప్పిన పార్టీగా మిగిలిపోతుందని మంత్రి జూపల్లి కృష్ణారావు హాట్ కామెంట్స్ చేశారు. అప్పులపై చర్చించేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ నేతలతో కలిసి ప్రెస్ క్లబ్ కు చేరుకున్న ఆయన.. మీడియా సమావేశం నిర్వహించారు. తాజాగా హరీష్ రావు తనకు రాసిన బహిరంగ లేఖపై జూపల్లి స్పందించారు. అప్పులపై తాను కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులకు చాలా వివరంగా లేఖ రాశానని, హరీష్ మాత్రం కట్టు కథలతో తనకు లేఖ పంపారని విమర్శించారు. ప్రభుత్వం తీసుకున్న అప్పులు మాత్రమే రూ.4.17 కోట్లుగా పేర్కొన్న హరీష్ రావు.. కార్పొరేషన్ల నుంచి తీసుకున్న అప్పులను అందులో పేర్కొనలేదన్నారు. కాళేశ్వరం కార్పొరేషన్, మిషన్ భగీరథలపై తీసుకున్న అప్పులు ప్రభుత్వం చెల్లించకపోతే.. కార్పొరేషన్లు ఎలా చెల్లిస్తాయని ప్రశ్నించారు. కార్పొరేషన్లకు ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? రైతుల నుంచి డబ్బులు వసూలు చేసి చెల్లిస్తారా? అని అడిగితే హరీష్ రావు నుంచి సమాధానం లేదన్నారు.

అప్పులపై తాను చెప్పే లెక్కలు తప్పని కేసీఆర్ తో చెప్పించాలన్నారు. తన లెక్కలు తప్పయితే.. రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. హరీష్ రావు చెప్పే లెక్కలు నిజమే అయితే రాజీనామా చేస్తానని ఎందుకు అనడం లేదని మంత్రి జూపల్లి ప్రశ్నించారు. ఎప్పుడెప్పుడు ఎంతెంత అప్పు చేశారో లేఖలో వివరంగా చెప్పానని, హరీష్ రావు ఆ వివరాలేవీ లేఖలో పేర్కొనలేదని తెలిపారు. వందలాది ప్రజలు త్యాగాలు చేస్తే తెలంగాణ వచ్చిందని, పవిత్ర ఉద్యమాన్ని కేసీఆర్ కుటుంబం స్వార్థానికి వాడుకుందని దుయ్యబట్టారు. హరీష్ రావు తాను అడిగినదానికి తప్ప.. లేఖలో ఏదేదో రాశారని, ఆయనది పలాయనవాదమని మంత్రి విమర్శించారు. నిజం చెప్పడానికి ధైర్యం, పౌరుషం ఉండాలని.. మాటల గారడీ చేయడం ఆపి.. దమ్ముంటే చర్చకు రావాలని మరోసారి సవాల్ చేశారు. పదేళ్లు అధికారంలో ఉండి అబద్ధాలు చెప్పేందుకు కొంచమైనా సిగ్గనిపించడం లేదా అని నిలదీశారు. హరీష్ రావు, కేటీఆర్ లకు కొంచమైనా రోషం, పౌరుషం ఉంటే రాజీనామాకు సిద్ధమని చెప్పాలని డిమాండ్ చేశారు.

Next Story