ఉగ్రవాదం వదిలిపెట్టే వరకు సింధు జలాలు వదిలేదే లేదు : పాక్‌కు భారత్ హెచ్చరిక

by Muthe.Rajitha |

సింధు జలాల ఒప్పందంపై (Indus Waters Treaty) పాకిస్తాన్ మంత్రులు చేస్తున్న హెచ్చరికలకు భారతదేశం దీటుగా సమాధానమిచ్చింది.

ఉగ్రవాదం వదిలిపెట్టే వరకు సింధు జలాలు వదిలేదే లేదు : పాక్‌కు భారత్ హెచ్చరిక
X

దిశ, వెబ్ డెస్క్ : సింధు జలాల ఒప్పందంపై (Indus Waters Treaty) పాకిస్తాన్ మంత్రులు చేస్తున్న హెచ్చరికలకు భారతదేశం దీటుగా సమాధానమిచ్చింది. సరిహద్దుల్లో ఉగ్రవాదాన్ని ఎగదోయడం, ఉగ్ర కార్యకలాపాలను ప్రోత్సహించడం పూర్తిగా మానుకొనే వరకు సింధు జలాల నిలిపివేత కొనసాగుతుందని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) స్పష్టం చేసింది. ఉగ్రవాదం విషయంలో తమ వైఖరిలో ఎటువంటి మార్పు లేదని ఢిల్లీ తేల్చి చెప్పింది.

భారత్‌పై పాక్ మంత్రుల అక్కసు

ఇటీవల పాకిస్తాన్ పెట్రోలియం శాఖ మంత్రి ముసాదిక్ మాలిక్, సమాచార శాఖ మంత్రి అట్టావుల్లా తరార్ భారత్‌ను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సింధు జలాలను భారత్ నియంత్రించడానికి ప్రయత్నిస్తోందని, పాక్‌లోకి చుక్క నీరు కూడా ప్రవహించకుండా పొరుగు దేశ ప్రధాని నరేంద్ర మోదీ అడ్డుకుంటున్నారని ముసాదిక్ ఆరోపించారు. తమ నీటి వాటాకు భంగం కలిగిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. నీటి అంశం తమ జాతీయ భద్రతతో ముడిపడి ఉందని, 1960 ఒప్పందాన్ని ఎవరూ రద్దు చేయలేరంటూ పాక్ మంత్రులు వ్యాఖ్యానించారు.

అంతర్జాతీయ చట్టాల సాకు చూపొద్దన్న భారత్

పాక్ మంత్రుల హెచ్చరికలపై భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ గట్టి చురకలు అంటించారు. 1960లో ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో కుదిరిన ఈ ఒప్పందం చట్టబద్ధమైన నిబంధనలకు కట్టుబడి ఉంటుందని, దాన్ని ఏకపక్షంగా నిలిపివేయడం గానీ, సవరించడం గానీ సాధ్యం కాదంటూ అంతర్జాతీయ వేదికలపై పాక్ ఆడుతున్న నాటకాలను ఆయన తిప్పికొట్టారు. సరిహద్దుల్లో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ, శాంతి చర్చలు మరియు ఒప్పందాల గురించి మాట్లాడే అర్హత పాకిస్తాన్‌కు లేదని భారత్ స్పష్టం చేసింది. ముందుగా సరిహద్దు ఉగ్రవాదాన్ని విడనాడాలని పాక్‌కు సూచించిన విదేశాంగ శాఖ, అప్పటివరకు సింధు జలాల విషయంలో తమ కఠిన వైఖరి కొనసాగుతుందని మరోసారి స్పష్టం చేసింది.

Next Story