- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యూరియా బుకింగ్ యాప్‌ను రైతులు సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్ అంకిత్
రైతులకు ఎరువులు పారదర్శకంగా, సకాలంలో అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, యూరియా బుకింగ్ యాప్‌ను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ అంకిత్ సూచించారు.

దిశ, టేకులపల్లి : రైతులకు ఎరువులు పారదర్శకంగా, సకాలంలో అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, యూరియా బుకింగ్ యాప్‌ను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ అంకిత్ సూచించారు. శుక్రవారం టేకులపల్లి మండలంలో విస్తృతంగా పర్యటించిన ఆయన బొమ్మనపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసీఎస్) ఎరువుల గిడ్డంగులు, విక్రయ కేంద్రాలు, తొమ్మిదో మైలు తండాలో జరుగుతున్న ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమం, టేకులపల్లి కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ), జూనియర్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఎరువుల నిల్వలు, యూరియా యాప్ పరిశీలన..
బొమ్మనపల్లి పీఏసీఎస్ ఎరువుల గిడ్డంగుల్లో యూరియా, ఇతర ఎరువుల నిల్వలను కలెక్టర్ పరిశీలించారు. స్టాక్ రిజిస్టర్‌లో నమోదైన వివరాలకు అనుగుణంగా నిల్వలు ఉన్నాయా లేదా అనే అంశాన్ని తనిఖీ చేసి, ఇప్పటివరకు వచ్చిన, పంపిణీ చేసిన, మిగిలిన నిల్వల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైతుల మొబైల్ ఫోన్లలో యూరియా బుకింగ్ యాప్ పనితీరును స్వయంగా పరిశీలించిన కలెక్టర్, యాప్ ద్వారా ముందస్తుగా యూరియాను బుక్ చేసుకోవడంతో పాటు జిల్లాలో అందుబాటులో ఉన్న నిల్వల వివరాలను కూడా తెలుసుకోవచ్చని వివరించారు. ఎరువుల పంపిణీలో పారదర్శకత పెంపొందించడంతో పాటు అక్రమ రవాణాను అరికట్టడంలో ఈ యాప్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. యూరియాకు ప్రత్యామ్నాయంగా నానో యూరియా వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు.
ఎస్‌ఐఆర్ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలి..
అనంతరం తొమ్మిదో మైలు తండాలో కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని పరిశీలించి దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన, నమోదు ప్రక్రియను తనిఖీ చేశారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పూర్తిస్థాయి పారదర్శకతతో కార్యక్రమాన్ని నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.అర్హులైన ప్రతి ఓటరిని గుర్తించి ఎన్యూమరేషన్ ఫారాల సేకరణను గడువులోగా పూర్తి చేయాలని, మరణించిన ఓటర్లు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు మారిన వారి వివరాలను ధృవీకరించి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు.
కేజీబీవీ, జూనియర్ కళాశాల ఆకస్మిక తనిఖీ..
టేకులపల్లి కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం, జూనియర్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ పాఠశాల ఆవరణ, వంటశాల, కిచెన్ షెడ్, పరిశుభ్రత, భోజన ఏర్పాట్లు, విద్యార్థినులకు అందిస్తున్న పోషకాహారాన్ని పరిశీలించారు. ఆర్వో ప్లాంట్ పనిచేయకపోవడంపై మండల విద్యాశాఖ అధికారిని ప్రశ్నించి, వెంటనే మరమ్మతులు పూర్తి చేసి విద్యార్థినులకు స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. విద్యార్థినులతో మాట్లాడి విద్యా సౌకర్యాలు, హాస్టల్ వసతులు, హాజరు, నూతన ప్రవేశాలు, ఉత్తీర్ణత శాతం, యూనిఫాంల పంపిణీ తదితర అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. కంప్యూటర్ ల్యాబ్‌లను పరిశీలించి విద్యార్థినులకు నాణ్యమైన ప్రాయోగిక విద్య అందించాలని అధ్యాపకులకు సూచించారు.
ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరవేయాలి..
ఈ సందర్భంగా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ, రైతులకు అవసరమైన ఎరువులు సకాలంలో అందేలా నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని, యూరియా బుకింగ్ యాప్‌ను విస్తృతంగా వినియోగించేలా రైతులను చైతన్యపరచాలని అన్నారు. అలాగే ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని నిబంధనలకు అనుగుణంగా పారదర్శకంగా నిర్వహించి అర్హులైన ప్రతి ఓటరికి నమోదు అవకాశం కల్పించాలని సూచించారు. పాఠశాలల్లో విద్యార్థినులకు నాణ్యమైన విద్యతో పాటు పరిశుభ్రమైన హాస్టల్ వసతులు, స్వచ్ఛమైన తాగునీరు, మెనూ ప్రకారం పోషకాహారం అందుబాటులో ఉండేలా అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు.
ఈ పర్యటనలో తహసీల్దార్ వీరభద్రం, మండల విద్యాశాఖ అధికారి జగన్, వ్యవసాయ శాఖ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.






