ప్రతి డివిజన్‌కు రూ.10 కోట్లకు పైగా నిధులు కేటాయించాం: ఎమ్మెల్యే

by Kodari Anjali |

వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో రాజకీయాలకు అతీతంగా ప్రజల అవసరాల ఆధారంగా అభివృద్ధి పనులు చేపట్టామని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు.

ప్రతి డివిజన్‌కు రూ.10 కోట్లకు పైగా నిధులు కేటాయించాం: ఎమ్మెల్యే
X

దిశ, హన్మకొండ కలెక్టరెట్: వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో రాజకీయాలకు అతీతంగా ప్రజల అవసరాల ఆధారంగా అభివృద్ధి పనులు చేపట్టామని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం రహమత్ నగరలోని మస్జిద్ ఆవరణలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ.. ఏబీసీ కేటగిరీ విధానంలో అత్యవసర పనులకు ప్రాధాన్యత ఇస్తూ నిధులు కేటాయించి అభివృద్ధిని వేగవంతం చేశామని అన్నారు. గత మూడు సంవత్సరాల్లో నియోజకవర్గంలోని ప్రతి డివిజన్‌కు సుమారు రూ.10 కోట్లకు పైగా అభివృద్ధి నిధులు కేటాయించినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. గతంలో కాంగ్రెస్ కార్పొరేటర్లు ఉన్న డివిజన్లకు కనీసం రూ.50 లక్షల నిధులు కూడా అందలేదని, ప్రస్తుతం మాత్రం వివక్ష లేకుండా అన్ని డివిజన్లలో సమాన అభివృద్ధి జరుగుతోందని పేర్కొన్నారు. కాజీపేట పోలీస్ స్టేషన్ నుంచి సోమిడి వరకు ప్రధాన రహదారి అభివృద్ధి, అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థల ఏర్పాటు, ఎస్సీ కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పన వంటి పనులు విస్తృతంగా చేపట్టామని తెలిపారు. గతంలో అభివృద్ధికి నోచుకోని ప్రాంతాల్లో కూడా రోడ్లు, డ్రైనేజీ పనులు పూర్తి చేసి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ కార్పొరేటర్లు రవీందర్ యాదవ్, విజయ శ్రీ రజాలి తదితరులు పాల్గొన్నారు.

Next Story