- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బస్సులు ఆగక ఇబ్బందులు.. రహీంఖాన్‌పేటలో ఆందోళన
ఆత్మకూరు మండలం రహీంఖాన్‌పేట స్టేజీ వద్ద ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సులు ఆపాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం సీపీఐ, సర్పంచులు, అఖిలపక్ష నాయకుల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

దిశ, ఆత్మకూరు(ఎం): ఆత్మకూరు మండలం రహీంఖాన్‌పేట స్టేజీ వద్ద ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సులు ఆపాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం సీపీఐ, సర్పంచులు, అఖిలపక్ష నాయకుల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. రహీంఖాన్‌పేట స్టేజీ సుమారు పది గ్రామాలకు ప్రధాన కూడలిగా ఉన్నప్పటికీ ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సులు ఆగకపోవడంతో విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, గ్రామీణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
రహీంఖాన్‌పేట, కూరెళ్ల, పుల్లాయిగూడెం, రాఘవపురం, తుక్కపురం తదితర గ్రామాలకు చెందిన ప్రజలు నిత్యం ఈ మార్గంలో ప్రయాణిస్తుంటారని, ముఖ్యంగా భువనగిరి కళాశాలలకు వెళ్లే విద్యార్థులు రవాణా సౌకర్యాల లేమితో ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. గతంలో కూడా ఆయా గ్రామాల సర్పంచులు కలిసి యాదగిరిగుట్ట డిపో మేనేజర్‌కు వినతిపత్రం అందజేసి రహీంఖాన్‌పేట స్టేజీ వద్ద ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సులు ఆపాలని కోరినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే అన్ని డిపోల బస్సులు రహీంఖాన్‌పేట స్టేజీ వద్ద ఆపేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సమాచారం అందుకున్న ఎస్సై లక్ష్మీనారాయణ పోలీసు సిబ్బందితో కలిసి ఘటనాస్థలికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. వారి సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించారు. ఈ కార్యక్రమంలో రహీంఖాన్‌పేట, కూరెళ్ల, పుల్లాయిగూడెం, రాఘవపురం, తుక్కపురం గ్రామాల సర్పంచులు కళావతి, ముత్తమ్మ, రామలింగయ్య, యథీశ్వర్, శ్రీవాణి, సీపీఐ జిల్లా నాయకులు ముత్యాలు, నర్సిరెడ్డి, వెంకన్న, నయీం, రమేష్ తదితరులు పాల్గొన్నారు.






