చుక్కలు చూపిస్తున్న చికెన్ రేట్లు.. సామాన్యుడికి 'నాన్‌వెజ్' దూరం!

by Naga Rani Yarlagadda |

తెలుగు రాష్ట్రాల్లో సామాన్యుడికి అత్యంత అందుబాటులో ఉండే ఏకైక నాన్ వెజ్ చికెన్, కోడిగుడ్లు.

చుక్కలు చూపిస్తున్న చికెన్ రేట్లు.. సామాన్యుడికి నాన్‌వెజ్ దూరం!
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో సామాన్యుడికి అత్యంత అందుబాటులో ఉండే ఏకైక నాన్ వెజ్ చికెన్, కోడిగుడ్లు. ప్రస్తుతం వీటి ధరలకు విపరీతంగా రెక్కలొచ్చాయి. కేవలం వారాల వ్యవధిలోనే ధరలు అమాంతం పెరిగిపోవడంతో మధ్యతరగతి, సామాన్య కుటుంబాల బడ్జెట్ తలకిందులవుతోంది. ముక్కలేనిదే ముద్ద దిగని నాన్ వెజ్ ప్రియులకు ఈ ధరల పెరుగుదల షాకిస్తోంది. గడిచిన వారంరోజులుగా మార్కెట్లో చికెన్ ధరలు గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. గతవారంలో కిలో స్కిన్ లెస్ చికెన్ ధర రూ.280-300 మధ్య ఉండగా.. ప్రస్తుతం హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఏరియాను బట్టీ రూ.300 నుంచి రూ.330 వరకూ అమ్ముతున్నారు. అటు విజయవాడలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. కిలో స్కిన్ లెస్ చికెన్ రేటు రూ.320 నుంచి రూ.330 పలుకుతోంది. కొన్ని రిటైల్ అవుట్ లెట్లలో ఈ ధరలు మరింత ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.

చికెన్ మాత్రమే కాకుండా.. ప్రొటీన్ కోసం ప్రధానంగా తినే కోడిగుడ్ల రేట్లు కూడా పెరగడం సామాన్యుడికి గుబులు పుట్టిస్తోంది. నెల రోజుల క్రితం మార్కెట్లో రూ.6 నుంచి రూ.7 మధ్య పలికిన ఒక గుడ్డు ధర.. ఇప్పుడు రిటైల్ మార్కెట్లో ఏకంగా రూ.8కి జంప్ అయింది. దీంతో ఒక ట్రే (30) గుడ్లు కొనాలంటే రూ.240 వరకూ ఖర్చు చేయాల్సిన పరిస్థితి. ఈ ధరల పెరుగుదలకు వ్యాపారులు, పౌల్ట్రీరంగ నిపుణులు ప్రధానంగా మూడు కారణాలు చెప్తున్నారు. తీవ్రమైన ఉష్ణోగ్రతల కారణంగా పౌల్ట్రీ ఫారాలలో కోళ్లు వేడిని తట్టుకోలేక మరణిస్తున్నాయి. దీనివల్ల ఉత్పత్తి మరియు సప్లై గణనీయంగా తగ్గింది. పైగా కోళ్లకు మేతగా వేసే మొక్కజొన్న, సోయాబీన్ ధరలు పెరగడంతో పౌల్ట్రీ నిర్వహణ భారం పెరిగి.. పెంపకాన్ని తగ్గించారు. దీనికితోడు శుభకార్యాలు, పెళ్లిళ్ల సీజన్ కావడంతో హోటళ్లు, ఫంక్షన్ హాళ్ల నుంచి ఆర్డర్లు పెరిగాయి. సప్లై తక్కువగా ఉండి, డిమాండ్ ఎక్కువగా ఉండటంతో రేట్లు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే నిత్యావసరాలు, వంటనూనెల ధరలతో ఇబ్బంది పడుతున్న సామాన్యుడికి.. ఇప్పుడు చికెన్, గుడ్ల ధరలు కూడా తోడవ్వడంతో వీకెండ్ వస్తే ఏం చేయాలోనన్న పరిస్థితి వచ్చింది.

Next Story