నకిలీవి అని తేల్చిన చర్యలేవి..?

by Jakkula.Mamatha |   (  Updated:2026-07-02 04:27:08  IST  )

నకిలీ ఇండ్ల పట్టాలతో ప్రభుత్వ ప్లాట్లను అమ్ముతున్నారని స్వయంగా రెవెన్యూ అధికారులే తేల్చారు.

నకిలీవి అని తేల్చిన చర్యలేవి..?
X

కంకణాలగూడం రెవెన్యూ పరిధిలో ప్రభుత్వం జారీ చేసిన ఇంటి పట్టాలలో కొన్ని నకిలీ పత్రాలు ఉన్నాయని స్వయంగా రెవెన్యూ అధికారులు విచారణ నిర్వహించి తేల్చారు. ఇదే విషయాన్ని అసలు లబ్ధిదారుడు ప్రజావాణిలో ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. అయితే ఇక్కడ రెవెన్యూ అధికారుల వ్యవహార శైలి ఇప్పటికి ఇంకా అంత చిక్కడం లేదు. నకిలీ సర్టిఫికెట్లను తెలిసినా రెవెన్యూ అధికారులే వారిపై చర్యలు తీసుకునేందుకు ఏమాత్రం ఆసక్తి చూపడం లేదు.

దిశ,సంస్థాన్ నారాయణపురం: నకిలీ ఇండ్ల పట్టాలతో ప్రభుత్వ ప్లాట్లను అమ్ముతున్నారని స్వయంగా రెవెన్యూ అధికారులే తేల్చారు. అసలు పట్టాదారు ప్లాట్ ను కబ్జా చేసి ఖాళీగా ఉన్న మరో ప్రభుత్వ ప్లాట్లలో ఇల్లు నిర్మించుకునేందుకు వెళ్లగా స్థానికంగా ప్లాట్ల దందా చేస్తున్న వ్యక్తులు అడ్డుకున్నారు. దీంతో అసలు ఇంటి పట్టా కలిగిన వ్యక్తి గత కొన్ని సంవత్సరాలుగా జిల్లా కలెక్టర్, ఆర్డీవో, తహశీల్దార్, పంచాయతీ కార్యాలయాలలో ఎన్ని ఫిర్యాదులు చేసిన అధికారులు అక్రమార్కులకు సహకారం అందించడం తప్ప నిజమైన లబ్ధిదారునికి ఎలాంటి సహాయం చేయలేదు. అంతేకాదండోయ్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేసిన స్థానిక రెవెన్యూ అధికారులు నకిలీ పట్టా సర్టిఫికెట్లని తెలిసిన అనంతరం ఖాళీగా ఉన్న ప్రభుత్వ ప్లాట్లలో ఆక్రమించోద్దని బ్యానర్లు కూడా పెట్టారు. ఏం జరిగిందో ఏమో కానీ బ్యానర్లు పెట్టిన మూడు రోజులకే వాటిని తొలగించి సదర స్థలాలలో కొందరు రాత్రికి రాత్రే ఇంటి నిర్మాణ పనులు ప్రారంభం చేశారు. దీనిపై పంచాయతీ అధికారులకు ఫోన్లో సమాచారం అందించగా వాళ్ళు కొనుగోలు చేసి ఇంటి నిర్మాణం చేసుకుంటున్నారని తామేమి చేయలేమంటూ సమాధానం ఇవ్వడంతో నిజమైన లబ్దిదారుడు అవాక్కయ్యాడు.

నకిలీ సర్టిఫికెట్లని తేల్చిన అధికారులు..

కంకణాలగూడం రెవెన్యూ పరిధిలో ప్రభుత్వం జారీ చేసిన ఇంటి పట్టాలలో కొన్ని నకిలీ పత్రాలు ఉన్నాయని స్వయంగా రెవెన్యూ అధికారులు విచారణ నిర్వహించి తేల్చారు. ఇదే విషయాన్ని అసలు లబ్ధిదారుడు ప్రజావాణిలో ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. అయితే ఇక్కడ రెవెన్యూ అధికారుల వ్యవహార శైలి ఇప్పటికీ ఇంకా అంత చిక్కడం లేదు. నకిలీ సర్టిఫికెట్లు తెలిసినా రెవెన్యూ అధికారులే వారిపై చర్యలు తీసుకునేందుకు ఏమాత్రం ఆసక్తి చూపడం లేదు.గత సంవత్సర కాలంగా తమకు ప్రభుత్వం ఇచ్చిన ఇంటి స్థలాన్ని ఇతరులు నకిలీ ధ్రువపత్రంతో కబ్జా చేశారని ఎన్ని సార్లు రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్న ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వెనుక రెవెన్యూ అధికారుల అలసత్వం తీవ్రంగా కనిపిస్తుంది.

ఆట, గుడి స్థలాలు కబ్జా!

కంకణాల గూడెం సర్వే నెంబర్ 153/2లో ప్రభుత్వ భూమిని సేకరించి సుమారు 240 చదరపు గజాల చొప్పున 70 ప్లాట్లను సేకరించి బలహీన వర్గాలకు అందించింది. ఇవి కాకుండా రెండు ఫ్లాట్లు ఆట స్థలానికి మరో రెండు ప్లాట్లను గుడి కోసం కేటాయించారు. అంతేకాకుండా మరికొంత ఖాళీ స్థలాన్ని కూడా వదిలివేశారు. దీంతో అక్రమార్కుల కన్ను ఆటస్థలంతో పాటు గుడి ఖాళీ స్థలం పై పడింది. ఇంకేముంది రెవెన్యూ కార్యాలయంలోని కొందరి సహకారంతో నకిలీ పట్టా సర్టిఫికెట్లను సృష్టించి ఆట, గుడి స్థలాలతో పాటు ఖాళీ స్థలాలను కూడా కబ్జా చేసి ఇంటిని నిర్మించుకున్నారు.

అయితే ఇందులో అసలు లబ్ధిదారుడు తన ఇంటి స్థలం కోసం రెండు సంవత్సరాలుగా రెవెన్యూ జిల్లా కలెక్టర్,ఆర్డీవో కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఉండడంతో విచారణ నిర్వహించిన అధికారులు నకిలీ సర్టిఫికెట్లు ఉన్నాయని తేల్చారు. అసలు పట్టా సర్టిఫికెట్ ఉన్న వ్యక్తి ప్లాటుతో ఇంటి నిర్మాణం చేసుకుంటుండగా మరో వ్యక్తి ఆయనను అడ్డుకోవడంతో పోలీస్ స్టేషన్ తో పాటు తాసిల్దార్ కు ఫిర్యాదు చేశాడు. అయినా తహసీల్దార్ నకిలీ సర్టిఫికెట్ల పై చర్యలు తీసుకునేందుకు జంకుతున్నారు.

నకిలీ పట్టా సర్టిఫికేట్లపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి: ఈద మల్లయ్య, అసలు లబ్ధిదారుని కుమారుడు, కంకణాల గూడం

కంకణాలగూడెం రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 153/2 లో మా నాన్న ఈద చిన్న లక్ష్మయ్య పేరుపై 240 చదరపు గజాల ఇంటి స్థలానికి పట్టా జారీ చేశారు. అయితే సదరు స్థలాన్ని ఇతరులు కబ్జా చేసి నన్ను బెదిరింపులకు గురి చేస్తున్నారు. దీనిపై జిల్లా కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్ కు ఫిర్యాదు చేసిన ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. నకిలీ సర్టిఫికెట్ అని తెలిసిన క్రిమినల్ చర్యలు తీసుకోమంటే తహసీల్దార్ సహకరించడం లేదు. కబ్జాదారుడు నన్ను భయపెట్టేందుకు కోర్టుకు వెళ్లడంతో కోర్టు పరిధిలో ఉందని చర్యలు తీసుకోవడం లేదని తహసీల్దార్ చేతులు దులుపుకుంటున్నారు.

సదరు స్థలాలపై కొందరు కోర్టుకు వెళ్లారు. పి.శ్రీనివాసరెడ్డి, తహసీల్దార్ నారాయణపురం

కంకణాల గూడెం రెవెన్యూ పరిధిలోని సర్వే నెం:153/2 లో ఇటీవల ఒకరు కోర్టుకు వెళ్లారు. కోర్టు పరిధిలో ఉన్నందున ఇట్టి విషయంలో జోక్యం చేసుకోలేము.

Next Story