పాతబస్తీలో చేతకాని దద్దమ్మ.. కంటోన్మెంట్‌లో కరెంట్ కట్ చేస్తానంటావా?

by Disha Web Desk |
పాతబస్తీలో చేతకాని దద్దమ్మ.. కంటోన్మెంట్‌లో కరెంట్ కట్ చేస్తానంటావా?
X

దిశ, తెలంగాణ బ్యూరో : పాతబస్తీలో ఏళ్ల తరబడి పేరుకుపోయిన కరెంట్ బిల్లులను వసూలు చేయడం చేతగాని దద్దమ్మ కంటోన్మెంట్‌కు కరెంట్, నీళ్లు కట్ చేస్తామని చెప్పడం సిగ్గు చేటని, దేశాన్ని విచ్ఛిన్నం చేసేలా మాట్లాడుతున్న కేసీఆర్ కుటుంబం ముమ్మాటికీ దేశద్రోహులేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​విమర్శలు చేశారు. బంజారాహిల్స్​ప్రసాద్​ల్యాబ్స్​వద్ద ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇలాగే దేశ ద్రోహ వ్యాఖ్యలు చేస్తే తెలంగాణ ప్రజలు కేసీఆర్ కుటుంబాన్ని ఉరికించి కొట్టడం ఖాయమని హెచ్చరించారు. తక్షణమే రాష్ట్ర ప్రజలకు, సైనికులకు ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్​చేశారు.

కంటోన్మెంట్ విషయంలో అసలు కేసీఆర్ కు వచ్చిన ఇబ్బందేంటని ఆయన ప్రశ్నించారు. ఆ భూములు కబ్జా చేయాలి, ఫాంహౌజ్ లు కట్టుకోవాలనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నట్లున్నారని ఆరోపణలు చేశారు. ప్రజలపై పన్నులు పెంచడమే కాక, నిధులు మళ్లించి పేద ప్రజల రక్తం తాగాలనే ఉద్దేశంతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్లున్నారన్నారు. కేసీఆర్ కుటుంబాన్ని చూస్తుంటే తనకు అనుమానంగా ఉందని, వారందరికీ డీఎన్ఏ టెస్ట్ చేయాలన్నారు. ఒకరేమో చైనాకు సపోర్ట్ చేస్తారని, ఇంకొకరు పాకిస్తాన్ కు, ఆఫ్ఘనిస్తాన్‌కు సపోర్ట్ చేస్తారని ఎద్దేవా చేశారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం జరిగి తెలంగాణ విద్యార్థులు అల్లాడుతుంటే సీఎం కనీసం స్పందించకపోవడం దారుణమని మండిపడ్డారు.

కంటోన్మెంట్‌లో సైనికులతోపాటు తెలంగాణ ప్రజలు కూడా నివాసం ఉంటారనే సోయి తెలంగాణ ప్రభుత్వానికి లేకుండా పోయిందని చురకలంటించారు. ఉగ్రవాద సంస్థలకు నంబర్ వన్ టార్గెట్ గా ఉన్న ప్రాంతానికి కరెంట్, నీళ్లు కట్ చేస్తారా అంటూ మండిపడ్డారు. ముఖ్యమంత్రి కుటుంబీకులు రజాకార్లా? నిజాం వారసులా అంటూ ఆయన ప్రశ్నించారు. కంటోన్మెంట్ ప్రాంతం నీ అయ్య జాగీరనుకున్నవా? దమ్ముంటే.. టచ్​చేసి చూడాలని, మాడి మసైపోతావంటూ మంత్రి కేటీఆర్‌ను బండి సంజయ్​హెచ్చరించారు. తెలంగాణ ప్రజలు త్వరలో ముఖ్యమంత్రి పవర్ కట్ చేయడం ఖాయమని ఆయన తెలిపారు. మంత్రి కేటీఆర్​ఇలాంటి విచ్ఛిన్నకర వ్యాఖ్యలు చేస్తే ఇతర పార్టీలు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కంటోన్మెంట్ విషయంలో సమస్య ఉంటే కూర్చుని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని, అసలు కంటోన్మెంట్ బోర్డు అధికారులతో ఎన్నిసార్లు సమావేశమయ్యారని బండి సంజయ్​ప్రశ్నించారు.

'కశ్మీర్ ఫైల్స్' సినిమా భేష్

బండి సంజయ్ పార్టీ నేతలతో కలిసి ప్రసాద్ ల్యాబ్ లో 'కశ్మీర్ ఫైల్స్' సినిమా తిలకించారు. జమ్మూ కశ్మీర్ లో జరిగిన వాస్తవ విషయాలను ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమాను నిర్మించిన వివేక్ అగ్నిహోత్రతి, అభిషేక్ అగర్వాల్ లను మనస్ఫూర్తిగా అభినందించారు. ఇదిలా ఉండగా ఇటీవల అస్వస్థతకు గురై యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, ఆసిఫాబాద్ జిల్లా మాజీ అధ్యక్షుడు జేబీ పౌడెల్ ను బండి సంజయ్ పరామర్శించారు. పౌడెల్ ఆరోగ్యస్థితిపై డాక్టర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్య చికిత్స అందించాలని వైద్యులను కోరారు.


Next Story

Most Viewed