- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అటవీ అధికారుల నిద్రమత్తు.. వేటగాళ్ల 'ఉచ్చు'లో బలవుతున్న వన్యప్రాణులు!
అడవి జంతువులకు రక్షణ కల్పించాల్సిన అటవీ శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.

దిశ,తల్లాడ: అడవి జంతువులకు రక్షణ కల్పించాల్సిన అటవీ శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. రోజువారీ పర్యవేక్షణను గాలికి వదిలేయడంతో వేటగాళ్లు రెచ్చిపోతున్నారు. తల్లాడ మండల పరిధిలోని లోకవరం ఫారెస్ట్ రేంజ్‌లో తాజాగా ముగ్గురు వేటగాళ్లు విద్యుత్ వైర్లను ఉచ్చులుగా ఏర్పాటు చేసి ఒక ఎలుగుబంటిని దారుణంగా వేటాడి చంపిన ఉదంతం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
ఎవరో చెబితే తప్ప తెలియని ‘అజ్ఞానం’!
అడవుల్లో నిరంతరం నిఘా ఉంచాల్సిన అధికారులు ఏసీ గదులకే పరిమితమయ్యారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వన్యప్రాణుల రక్షణ కోసం క్షేత్రస్థాయిలో తిరగాల్సిన సిబ్బంది విధులను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఎవరో సమాచారం ఇస్తే తప్ప ఒక ఎలుగుబంటి ప్రాణం పోయిందనే కనీస విషయాన్ని కూడా తెలుసుకోలేని దయనీయ స్థితిలో తల్లాడ మండల ఫారెస్ట్ అధికారులు ఉండటం వారి పనితీరుకు అద్దం పడుతోందని పలువురు ఆరోపిస్తున్నారు.
విద్యుత్ వైర్ల మృత్యుపాశాలు..
మండల పరిధిలోని లోకవరం సౌత్ బీట్ ఫారెస్ట్ లో ఈనెల 23వ తేదీన వేటగాళ్లు అడవి పొలిమేరల్లో, వన్యప్రాణులు సంచరించే దారుల్లో బహిరంగంగానే విద్యుత్ వైర్ల ఉచ్చులు ఏర్పాటు చేసి ఎలుగుబంటి మృతికి కారణమయ్యారు. ఇంత జరుగుతున్నా అటవీ శాఖకు చెందిన బీట్ ఆఫీసర్లు గానీ, ఉన్నతాధికారులు గానీ ఆయా ప్రాంతాలను తనిఖీ చేసిన దాఖలాలు లేవు. అధికారుల ఈ నిర్లక్ష్య వైఖరి వల్లే వేటగాళ్లకు అడ్డు అదుపు లేకుండా పోతోందని, మూగజీవాల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయని పర్యావరణ ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని,నిరంతర నిఘా ఏర్పాటు చేసి వన్యప్రాణులను కాపాడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉమాను "దిశ" వివరణ కోరగా..
వేటను నియంత్రించడానికి మేము రాత్రి గస్తీ, పగటిపూట కాలినడకన గస్తీ నిర్వహిస్తున్నాము. నిందితుల ఆచూకీ కనుగొనడానికి మేము సీసీ కెమెరాలు మరియు ట్రాప్ కెమెరాలను ఉపయోగిస్తున్నాము. ఫారెస్ట్ ఫ్రిడ్జ్ గ్రామాలలో మాకు సరిహద్దు కందకం మాత్రమే ఉంది, రక్షణ గోడలు లేవు,చెక్ పోస్టులు లేవు.వేట లేదా స్మగ్లింగ్‌ను నిరోధించడానికి తగినంత సిబ్బంది లేకపోవడం మాకు ప్రధానమైన సమస్యలు వెంటాడుతున్నాయి. అదేవిధంగా విద్యుత్ చట్టం 2003 లోని సెక్షన్ 135 ప్రకారం అక్రమంగా కరెంట్ దొంగిలిస్తున్న నిందితులపై కఠిన కేసులు నమోదు చేయాల్సి ఉంది. అయితే అటవీ శాఖ మాత్రమే చొరవ తీసుకుని కేసులు బుక్ చేస్తోందని, విద్యుత్ శాఖ మాత్రం ఇప్పటివరకు ఎలాంటి తదుపరి చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆమె తెలిపారు.






