కోహ్లీ సలహాలు.. ఏడాదిన్నరకే పక్కనపెట్టేశా: సీక్రెట్ రివీల్ చేసిన సంజూ శాంసన్

by Gantepaka Srikanth |

భారత క్రికెట్‌లో ఫిటెనెస్, లైఫ్‌స్టైల్, కఠినమైన క్రమశిక్షణ అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చే పేరు విరాట్ కోహ్లీ.

కోహ్లీ సలహాలు.. ఏడాదిన్నరకే పక్కనపెట్టేశా: సీక్రెట్ రివీల్ చేసిన సంజూ శాంసన్
X

దిశ, వెబ్‌డెస్క్: భారత క్రికెట్‌లో ఫిటెనెస్, లైఫ్‌స్టైల్, కఠినమైన క్రమశిక్షణ అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చే పేరు విరాట్ కోహ్లీ. జట్టులోని యంగ్ క్రికెటర్లందరికీ ఆయనో రోల్ మోడల్. అయితే, కోహ్లీ ఇచ్చిన లైఫ్ స్టైల్, డైట్ సలహాలను తాను కొంతకాలం అనుసరించానని, కానీ ఎక్కువ రోజులు దాన్ని కొనసాగించలేకపోయానని టీమిండియా బ్యాటర్ సంజూ శాంసన్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడిన సంజూ శాంసన్.. కోహ్లీ ఇచ్చిన ఫిట్‌నెస్ సలహాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘జిమ్‌లో విరాట్ భాయ్ వర్కవుట్స్ చేసే విధానం, ఆయనలో ఉండే కసి (Fire) నన్ను ఎంతగానో ఆకట్టుకునేది. అంతర్జాతీయ స్థాయిలో సుదీర్ఘ కాలం రాణించాలంటే ఏం చేయాలో చెప్పండి అని నేను కోహ్లీని అడిగాను. దానికి కోహ్లీ స్పందిస్తూ.. అంతర్జాతీయ క్రికెట్‌లో నిలదొక్కుకోవాలంటే ఆటతో పాటు లైఫ్ స్టైల్ చాలా కీలకమని చెప్పారు. దీనికి డైట్ చాలా ముఖ్యం. పదేళ్లు పాటిస్తే నీ లైఫ్‌మొత్తం మారిపోతుంది’ అని కోహ్లీ చెప్పుకొచ్చారని సంజూ పేర్కొన్నారు.

ఏడాదిన్నర తర్వాత ట్రాక్ తప్పా..

కోహ్లీ చెప్పిన కఠినమైన డైట్, లైఫ్‌స్టైల్‌ను తాను కూడా పాటించడానికి ప్రయత్నించినట్లు సంజూ తెలిపారు. "ఆయన చెప్పినట్లే దాదాపు ఏడాది నుంచి ఏడాదిన్నర పాటు ఆయన్ను ఫాలో అయ్యాను. కానీ ఆ తర్వాత నా వల్ల కాలేదు. ట్రాక్ తప్పేశాను" అని సంజూ నిజాయితీగా అంగీకరించారు. టీమిండియాలో చోటు కోసం జరిగే నిరంతర పోటీ (Rat Race) గురించి కూడా సంజూ శాంసన్ స్పందించారు. "మన దేశంలో క్రికెటర్ల మధ్య ఎప్పుడూ ఒక రేసు నడుస్తూనే ఉంటుంది. 2026 టీ20 ప్రపంచకప్‌నకు ముందే ఆ నిరంతర పోటీలో భాగం కాకూడదని నిర్ణయించుకున్నాను. ఇప్పుడు నా వయసు 31 ఏళ్లు. ఇంకా కొన్ని ఏళ్ల క్రికెట్ మాత్రమే మిగిలి ఉంది. అందుకే నా పద్ధతిలోనే, ఆటను ఆస్వాదిస్తూ ఆడాలని డిసైడ్ అయ్యాను. నన్ను ఎవరు ఎలా ఆడాలి. ఏం చేయాలి అని చెప్పాల్సిన అవసరం లేదు. సంజూ ఎలా ఆడాలో సంజూయే నిర్ణయించుకుంటాడు" అని ఆయన స్పష్టం చేశారు.

Next Story