సేంద్రీయ సాగు వైపు అడుగులేద్దాం : ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు

by Batti.Sumithra |

రైతులు శాస్త్రవేత్తల సూచనలు పాటిస్తూ పంటలు పండించి బాగుపడాలని, సేంద్రియ సాగు వైపు అడుగులు వేయాలని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు.

సేంద్రీయ సాగు వైపు అడుగులేద్దాం : ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు
X

దిశ, ఉట్నూర్ : రైతులు శాస్త్రవేత్తల సూచనలు పాటిస్తూ పంటలు పండించి బాగుపడాలని, సేంద్రియ సాగు వైపు అడుగులు వేయాలని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. మంగళవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉన్నతాధికారులతో కలిసి వర్చువల్‌గా నిర్వహించిన 'రైతు నేస్తం' 100వ ఎపిసోడ్‌లో ఉట్నూర్ మండల కేంద్రంలోని రైతు వేదిక నుంచి కలెక్టర్ రాజర్షి షాతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు తమ సాగు పద్ధతుల్లో మార్పులు తెచ్చుకోవాలని, పూర్వకాలపు సేంద్రియ విధానాల వైపు మళ్లాలని పిలుపునిచ్చారు.

మనుషుల నిర్లక్ష్యం, కాలుష్యం వల్లే ఎల్-నినో వంటి ప్రతికూల వాతావరణ మార్పులు సంభవిస్తున్నాయని, దీనివల్ల భవిష్యత్తులో తీవ్ర నీటి ఎద్దడి తలెత్తే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తాగు, సాగు నీటి సంరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ఇళ్లు, పొలాల వద్ద ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని సూచించారు. ప్రైవేట్ వ్యాపారులు చెప్పే ఆచరణ సాధ్యంకాని హైబ్రిడ్ విత్తనాలు, హోమియో ఫెర్టిలైజర్ల మాటలు నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు. తక్కువ నీటితో ఎక్కువ ఆదాయాన్ని ఇచ్చే 'ఆయిల్ పామ్' సాగును ప్రోత్సహించేందుకు మన ప్రాంతంలో ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. ప్రతి రైతు తమ పొలం గట్లపై చెట్లు నాటాలని, వ్యవసాయ అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ రైతులకు సరైన మార్గదర్శనం చేయాలని ఆదేశించారు.

సహజ సేద్యంతోనే నేలకు, పంటలకు రక్షణ..కలెక్టర్ రాజర్షి షా

రసాయనిక ఎరువుల వినియోగాన్ని తగ్గించి, ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు మొగ్గు చూపాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా పిలుపునిచ్చారు. యూరియా, డీఏపీ మితిమీరిన వాడకం వల్ల ప్రతికూల వాతావరణ ప్రభావాలు తీవ్రమవుతాయని, ఆవు పేడతో పాటు సేంద్రియ ఎరువుల వినియోగం ద్వారా నేల సారం పెరుగుతుందని స్పష్టం చేశారు. ప్రకృతి సేద్యం చేసే రైతులకు ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సాహం అందిస్తుందన్నారు. జిల్లాలో వర్షపాతం లోటు ఉన్నందున అంతర సేద్యం, మల్చింగ్ ద్వారా నేలలో తేమను కాపాడుకోవాలని సూచించారు. భూగర్భ జలాలను పెంచేందుకు ఫార్మ్ పాండ్లు, ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. ప్రత్యామ్నాయ పంటలతో పాటు ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తున్నామని, డి-పట్టా రైతులకు కూడా వెసులుబాటు కల్పిస్తూ మైక్రో ఇరిగేషన్‌పై భారీ సబ్సిడీ ఇస్తున్నామని తెలిపారు. జిల్లాకు మరో 1,350 మెట్రిక్ టన్నుల డీఏపీ రానుందని, పట్టా లేని రైతులు కూడా యాప్ ద్వారా ఎరువులు పొందే అవకాశం కల్పించామని పేర్కొన్నారు. అలాగే నానో ఎరువుల వాడకం మేలని, జొన్న కొనుగోలు బకాయిలు రూ.130 కోట్లను త్వరలోనే రైతుల ఖాతాల్లో జమ చేస్తామని హామీ ఇచ్చారు.

విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వ్యవసాయ అధికారులను, ఆదర్శ రైతులను కలెక్టర్, ఎమ్మెల్యే మెమెంటోలు అందజేసి అభినందించారు. అనంతరం రైతులకు మొక్కలను అందించి, రైతు వేదికలో ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మోహన్ సింగ్, జిల్లా వ్యవసాయ అధికారి రవీందర్, ఎమ్మార్వో రఘునాథ్, ఎంపీడీవో రైసుద్దీన్, ఏడీఏలు శ్రీధర్, రామ్‌కిషన్, ప్యాక్స్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, సర్పంచ్ అనిత, మండల వ్యవసాయ, వ్యవసాయ విస్తరణ, ఉద్యాన శాఖల అధికారులు, ఇతర శాఖల సిబ్బంది, రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Next Story