- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి
రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని, లేకపోతే జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి హెచ్చరించారు.

దిశ, నిజామాబాద్ అర్బన్ : రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని, లేకపోతే జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి హెచ్చరించారు. బీజేవైఎం ఆధ్వర్యంలో ప్రైవేట్ కళాశాలల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదలను డిమాండ్ చేస్తూ విద్యార్థుల నుంచి సంతకాల సేకరణతో పాటు మిస్డ్ కాల్ ఉద్యమాన్ని మంగళవారం ప్రారంభించారు. బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు వంశీ గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దినేష్ పటేల్ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో విద్యార్థులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల కాకపోవడంతో వేలాది మంది విద్యార్థులు చదువును కొనసాగించలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు ఫీజుల కోసం విద్యార్థులపై ఒత్తిడి తీసుకువస్తున్నాయని, పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు అప్పులు చేసి చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యార్థుల విద్యా హక్కును పరిరక్షించాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం బాధాకరమని పేర్కొన్న ఆయన, పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలన్నింటినీ తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే జిల్లాలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు వంశీ గౌడ్ మాట్లాడుతూ, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం బీజేవైఎం నిరంతరం పోరాటం చేస్తుందని తెలిపారు. సంతకాల సేకరణ, మిస్డ్ కాల్ ఉద్యమం ద్వారా విద్యార్థుల గళాన్ని ప్రభుత్వానికి వినిపిస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే బీజేపీ, బీజేవైఎం ఆధ్వర్యంలో జిల్లా, రాష్ట్ర స్థాయిలో విద్యార్థులతో కలిసి భారీ స్థాయిలో ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం తెలంగాణ రాష్ట్ర కో-కోశాధికారి అమంద్ విజయ్ కృష్ణ, బీజేపీ జిల్లా నాయకులు విపుల్ రావు, రాకేష్, రాజ్ గణేష్, బీజేపీ ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు ఓం సింగ్, బీజేవైఎం నాయకులు సాయి ప్రవీణ్‌తో పాటు పలువురు బీజేపీ, బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.






