శుభలగ్నం సినిమా సీన్ రిపీట్.. రూ.1.5 కోట్లకు భర్తను అమ్మేసిన భార్య

by Malleboina Mahesh |

భోపాల్‌లో రియల్ లైఫ్ 'శుభలగ్నం' సినిమా రిపీట్ అయింది. ప్రియుడి కోసం భార్యకు రూ.1.5 కోట్లు, డూప్లెక్స్ ఇల్లు చెల్లించిన ప్రియురాలు. 23 ఏళ్ల బంధానికి కోర్టు సాక్షిగా ఆర్థిక ముగింపు పలికారు

శుభలగ్నం సినిమా సీన్ రిపీట్.. రూ.1.5 కోట్లకు భర్తను అమ్మేసిన భార్య
X

దిశ, వెబ్ డెస్క్: డబ్బు కోసం కట్టుకున్న భర్తను భార్య అమ్మేసిన ఘటన గతంలో కేవలం సినిమాల్లో మాత్రమే కనిపించేది. తాజాగా ఈ విచిత్రమైన సంఘటన నిజ జీవితంలోనూ జరిగింది. అచ్చం శుభలగ్నం సినిమాలో చేసినట్లే ఓ భార్య తన భర్తను ప్రియురాలికి అమ్మేసింది. ఈ షాకింగ్ ఘటన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో చోటు చేసుకుంది. తన భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ నుండి భారీ మొత్తంలో ఆస్తులు, నగదు తీసుకుని ఆమె తన భర్తను వదులుకోవడానికి సిద్ధపడటం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.

ఏం జరిగిందంటే..?

భోపాల్‌కు చెందిన 42 ఏళ్ల వ్యక్తికి తన ఆఫీసులో పనిచేసే 52 ఏళ్ల మహిళతో పరిచయం ఏర్పడి, అది కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. దీంతో ఇంట్లో భార్య, ఇద్దరు కుమార్తెలను అతను పట్టించుకోవడం మానేశాడు. తరచూ గొడవలు జరుగుతుండటంతో భార్య ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. కోర్టు అధికారులు ఇరుపక్షాలకు పలుమార్లు కౌన్సిలింగ్ ఇచ్చి కలపడానికి ప్రయత్నించారు. అయితే, భర్త మాత్రం తన భార్యతో కాకుండా ప్రియురాలితోనే కలిసి ఉంటానని కోర్టులో భీష్మించుకు కూర్చున్నాడు.

ప్రియుడి భార్య డిమాండ్లకు ఒప్పుకున్న ప్రియురాలు

భర్త మొండితనాన్ని చూసిన భార్య, తన పిల్లల భవిష్యత్తు కోసం ఒక వినూత్న ప్రతిపాదన పెట్టింది. తన భర్తను వదులుకోవాలంటే తమకు రూ.1.5 కోట్ల విలువైన పరిహారం కావాలని డిమాండ్ చేసింది. ఇందులో భాగంగా ప్రియురాలికి చెందిన ఒక డూప్లెక్స్ ఇల్లు, అదనంగా రూ.27 లక్షల నగదు ఇవ్వాలని కోరింది. ఆశ్చర్యకరంగా, ఆ ప్రియురాలు ఈ షరతులకు వెంటనే అంగీకరించింది. తన వద్ద ఉన్న ఆస్తులను ఇచ్చి, ప్రియుడిని దక్కించుకోవడానికి ఆమె సిద్ధపడటం తో కోర్టు సమక్షంలోనే ఈ ఒప్పందం కుదిరింది. ప్రస్తుతం ఆ భార్య తన పిల్లలతో కలిసి కొత్త ఇంటికి మారిపోగా, భర్త తన ప్రియురాలితో కలిసి ఉండటానికి వెళ్లిపోయాడు.

Next Story