భర్తను చంపి బాత్‌రూమ్ టైల్స్ కింద పాతిపెట్టిన భార్య

by Malleboina Mahesh |

ఆగ్రాలో దారుణం.. భర్త సురేంద్రను చంపి బాత్‌రూమ్ నేల కింద పాతిపెట్టి, కొత్త టైల్స్ వేయించిన భార్య రూబీ.. 45 రోజుల తర్వాత శవం వెలికితీత!

భర్తను చంపి బాత్‌రూమ్ టైల్స్ కింద పాతిపెట్టిన భార్య
X

దిశ, వెబ్‌డెస్క్: ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ‘దృశ్యం’ సినిమా తరహా సంఘటన సంచలనంగా మారింది. పక్కా ప్లాన్‌తో జరిగిన ఒక భయంకరమైన హత్యోదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కట్టుకున్న భర్తను హత్య చేసిన భార్య బాత్‌రూమ్ టైల్స్ కింద పాతిపెట్టింది. ఆ తర్వాత 45 రోజుల పాటు ఏమీ ఎరగనట్లు డ్రామాలు ఆడిన భార్య రూబీని పోలీసులు అరెస్ట్ చేశారు. సురేంద్ర కుమార్ శర్మ మే 18 నుంచి వింతగా కనిపించకుండా పోగా, అతని భార్య భర్త ఎక్కడికో వెళ్లాడంటూ బంధువులను నమ్మిస్తూ వచ్చింది. ఆ తర్వాత మే 26న పోలీసులకు మిస్సింగ్ ఫిర్యాదు కూడా ఇచ్చి.. భర్త కోసం వెతుకుతున్నట్లు నాటకమాడింది. అయితే, రూబీ ప్రవర్తన, ఆమె ఇస్తున్న పొంతన లేని సమాధానాలపై మృతుడి సోదరుడు అనిల్ శర్మ అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసుల దర్యాప్తు వేగం పుంజుకుంది.

అనిల్ శర్మ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు రూబీని తమదైన శైలిలో విచారించగా అసలు నిజం బయటపడింది. అనుమానంతో పోలీసులు ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించగా, బాత్‌రూమ్‌లో కొత్తగా ప్లాస్టరింగ్ చేసి, సరికొత్తగా టైల్స్ వేసి ఉండటాన్ని గమనించారు. వెంటనే ఆ కొత్త టైల్స్‌ను, నేలను తవ్వి చూడగా లోపల సురేంద్ర కుమార్ శర్మ మృతదేహం విశేషాలు కుళ్లిపోయిన స్థితిలో లభ్యమయ్యాయి. తానే భర్తను చంపేసి, ముందే ప్లాన్ చేసుకున్న మేస్త్రీలతో బాత్‌రూమ్ మరమ్మతుల పేరుతో గొయ్యి తీయించి అందులో పూడ్చిపెట్టినట్లు రూబీ అంగీకరించింది. శవాన్ని ఇంట్లోనే పెట్టుకుని ఏమాత్రం భయం లేకుండా ఆమె ఇన్ని రోజులు గడపడం గమనార్హం. ఈ దారుణ కుట్రలో ఆమెకు మరెవరైనా సహకరించారా అనే కోణంలో పోలీసులు ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు.

Next Story