ఖమేనీ అంత్యక్రియలు ప్రారంభం.. పక్కనే 14 నెలల మనవరాలి చిన్న శవపేటిక

by Prasad Jukanti |

ఇరాన్ దివంగత సుప్రీం లీడర్ అలీ ఖమేనీ అంత్యక్రియలు ప్రారంభం అయ్యాయి. ఖమేనీ పక్కనే 14 నెలల ఆయన మనవరాలి చిన్న శవపేటిక ప్రజలను మరింత కంట తడి పెట్టిస్తోంది.

ఖమేనీ అంత్యక్రియలు ప్రారంభం.. పక్కనే 14 నెలల మనవరాలి చిన్న శవపేటిక
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఇరాన్ దివంగత సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు శనివారం అధికారికంగా ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా జరిపిన దాడుల్లో ఖమేనీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు మరణించిన సంగతి తెలిసిందే. నాలుగు నెలల అనంతరం వీరి అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నారు. ఇవాళ ఖమేనీతో పాటు మృతి చెందిన ఆయన కుటుంబ సభ్యుల భౌతికకాయాలను ఖమేనీ మద్దతుదారులు, దేశప్రజల సందర్శనార్థం ఇరాన్ రాజధాని టెహ్రాన్‍లో ఉంచారు. అయితే ఖమేనీ భౌతికకాయం పక్కనే ఆయన 14 నెలల మనవరాలు జహ్రా మొహమ్మదీ చిన్న శవపేటికను కూడా ఉంచారు. ఆ శవపేటిక పక్కనే ఆ చిన్నారి ఫోటో ఫ్రేమ్‍ను ఉంచారు. ఈ సన్నివేశం అక్కడికి వచ్చిన అనేక మందిని కన్నీరు పెట్టిస్తోంది.

ఈ నెల 9న ఖననం:

ఖమేనీ పార్థీవ దేహాన్ని ఆయన సొంత పట్టణం ఇరాన్ లోని ముషహద్‍లో ఈ నెల 9వ తేదీన ఖననం చేయనున్నారు. ప్రజల సందర్శనార్థం ఖమేనీ భౌతిక కాయాన్ని ఉంచిన శవపేటికను ఇస్లామిక్ రిపబ్లిక్ జెండాతో కప్పి ఉంచారు. దానిపై ఆయన నల్లటి తలపాగను ఉంచారు. ఖమేనీ పార్థివ దేహానికి నివాళులు అర్పించేందుకు ఇరాన్ నలుమూలల నుంచే కాకుండా పొరుగున ఉన్న ఇరాక్ నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు తరలి వస్తున్నారు. దాదాపు 1.5 కోట్ల నుంచి 2 కోట్ల మంది ప్రజలు ఖమేనీ భౌతికకాయాన్ని చూసేందుకు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఆయనకు శ్రద్ధాంజలి ఘటించేందుకు తరలివస్తున్న వారంతా ప్రతీకారానికి గుర్తుగా ఎర్రజెండాలను పట్టుకుని డెత్ ఆఫ్ అమెరికా అంటూ నినాదాలు చేసిన వీడియోలు సోషల్ మీడియాలో దర్శనం ఇస్తున్నాయి. ఖమేనీ మృతదేహాన్ని చూసిన ఆయనతో సన్నిహితంగా పని చేసిన నాయకులు ఉద్వేగానికి గురవుతున్నారు. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ, పార్లమెంట్ స్పీకర్ ఘాలిబఫ్ ఖమేనీని గుర్తు చేసుకుని కంటతడి పెట్టుకున్నారు.

భారత్ తరఫున హాజరు:

ఈ అంత్యక్రియల వేడుకకు ఇరాన్ ఉన్నతాధికారులతో పాటు అంతర్జాతీయ ప్రతినిధులు హాజరవుతున్నారు. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బాఘర్ గాలిబాఫ్ మరియు కొత్తగా బాధ్యతలు చేపట్టిన విప్లవాత్మక గార్డ్స్ (IRGC) చీఫ్ అహ్మద్ వాహిదీ తదితరులు ఖమేనీకి నివాళులర్పించారు. ఇక భారతదేశం తరఫున బిహార్ గవర్నర్ సయ్యద్ అతా హస్నైన్, కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి పబిట్రా మార్గరీటా ఈ అధికారిక అంత్యక్రియల కార్యక్రమానికి హాజరై భారత్ తరఫున సంతాపం తెలియజేశారు.

Next Story