మూగజీవిని కాపాడబోయి అనంతలోకాలకు.. బావిలో ఊపిరాడక ముగ్గురు యువకుల దుర్మరణం

by Ramesh Naini |   (  Updated:2026-07-04 09:11:06  IST  )

ఒక మూగజీవి ప్రాణాలు నిలపాలనుకున్న వారి తపన.. వారి ప్రాణాలనే బలితీసుకుంది.

మూగజీవిని కాపాడబోయి అనంతలోకాలకు.. బావిలో ఊపిరాడక ముగ్గురు యువకుల దుర్మరణం
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఒక మూగజీవి ప్రాణాలు నిలపాలనుకున్న వారి తపన.. వారి ప్రాణాలనే బలితీసుకుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మైహర్ జిల్లా అమర్‌పటన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఖరంసేడా గ్రామంలో శుక్రవారం రాత్రి ఈ హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. బావిలో పడిపోయిన ఎద్దును రక్షించేందుకు ప్రయత్నించిన నలుగురు గ్రామస్తుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. గ్రామానికి చెందిన రామ్‌నివాస్ కుష్వాహా ఇంటి సమీపంలో ఉన్న సుమారు 35 నుంచి 40 అడుగుల లోతైన బావిలో శుక్రవారం రాత్రి 8.30 గంటల సమయంలో ఒక ఎద్దు పడిపోయింది. బావిలో చిక్కుకుని తల్లడిల్లుతున్న ఎద్దును కాపాడేందుకు గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు తాళ్ల సాయంతో బావిలోకి దిగారు. అయితే బావి అడుగుభాగంలో ఆక్సిజన్ లేకపోవడం, విష వాయువులు పేరుకుపోవడంతో వారు కొద్దిసేపటికే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు.

ఎలాంటి భద్రతా పరికరాలు లేకుండానే..

వారి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో పైభాగంలో ఉన్న మరో ఇద్దరు గ్రామస్తులు కూడా ఎలాంటి భద్రతా పరికరాలు లేకుండానే వారిని రక్షించేందుకు బావిలోకి దిగారు. కానీ వారు కూడా అదే పరిస్థితికి గురై స్పృహ తప్పి పోయారు. బావి లోపల నుంచి ఎలాంటి కదలికలు కనిపించకపోవడంతో గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే తాళ్లు, హుక్కులు, ఇతర సాధనాల సహాయంతో నలుగురినీ తీవ్ర శ్రమతో ఒక్కొక్కరిని బయటకు తీసుకొచ్చారు. అనంతరం వారిని అమర్‌పటన్ సివిల్ ఆసుపత్రికి తరలించారు. అయితే వైద్యులు పరీక్షించి ముగ్గురు గ్రామస్తులు అప్పటికే మృతి చెందినట్లు ప్రకటించారు. మృతులను కృష్ణకుమార్ యాదవ్ (28), వీరేంద్ర యాదవ్ (47), రాహుల్ యాదవ్ (34)గా గుర్తించారు. మరో వ్యక్తి రామచంద్ర యాదవ్ పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.

ప్రాథమిక సమాచారం ప్రకారం, బావి అడుగుభాగంలో చాలాకాలంగా గాలి ప్రసరణ లేకపోవడంతో కార్బన్ మోనాక్సైడ్ లేదా ఇతర విష వాయువులు పేరుకుపోయి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఆక్సిజన్ కొరత కారణంగానే ఈ ప్రమాదం సంభవించి ఉండొచ్చని పోలీసులు తెలిపారు. అయితే పోస్టుమార్టం నివేదిక అనంతరం మరణాలకు గల అసలు కారణాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఒకేసారి ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోవడంతో ఖరం సోడా గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

‘మగవాళ్లను చంపేయడం ఎలా?’Vs ‘భార్యను బొందపెట్టడం ఎలా?’.. సోషల్ మీడియాలో వింత వార్

Next Story